న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘పీఎం నరేంద్ర మోదీ’సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఈ చిత్రం విడుదలపై కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీనికి సంబంధించిన వాదనలను సోమవారం (8న) వింటామని జస్టిస్ ఎస్‌ఏ బోబ్డేతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. మోదీ బయోపిక్ విడుదలను నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ ప్రతినిధి అమన్ పన్వార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దేశంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రభావం ప్రజలపై పడే అవకాశం ఉందని తెలిపారు. దీంతో చిత్రం విడుదలను నిలిపివేయాలని సుప్రీంకోర్టును కోరారు. అమన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ ఏఎం సింఘ్వీ వాదనలు వినిపించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం విడుదల విషయంలో జోక్యం చేసుకునేందుకు మధ్యప్రదేశ్, బాంబే హైకోర్టులు నిరాకరించాయని తెలిపారు. కాగా, మోదీ బయోపిక్ విడుదల చేయవద్దని కోరుతూ కాంగ్రెస్ నేతలు ఈసీకి కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈసీ శుక్రవారం తుది నిర్ణయం తీసుకోనుంది.
మోదీ బయోపిక్ విడుదల వాయిదా..
మోదీ బయోపిక్ విడుదల వాయిదా పడినట్లు చిత్ర నిర్మాత సందీప్ ఎస్.సింగ్ వెల్లడించారు. చిత్రం విడుదలకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని ట్వీట్ చేశారు. తొలుత ఈ చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేయాలని భావించినా.. పబ్లిక్ డిమాండ్ మేరకు వారం ముందుగా (5న) రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఈ సినిమాకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) నుంచి క్లియరెన్స్ రాలేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment