బీజేపీలో స్టార్ కాంపెయినర్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే. సొంత నియోజకవర్గం వారణాసిలో నామినేషన్‌కు ముందు రోజు 6 కి.మీ. మేర రోడ్ షో నిర్వహించి తన బలాన్ని ప్రదర్శించారు. ఓపెన్ టాప్ వాహనంలో సాగిన ఈ రోడ్‌షోకి జనం వెల్లువెత్తారు. ఇలా మోదీ ఎక్కడ ఏ ర్యాలీ చేసినా దాని వెనుక ఒక వ్యూహం దాగి ఉంది. గత లోక్‌సభ ఎన్నికల ఫలితాల్ని, అయిదేళ్లలో జరిగిన అసెంబ్లీ ఫలితాల్ని బేరీజు వేసుకుంటూ కొత్త రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ, బలోపేతం, పార్టీ హవా తగ్గిన చోట తిరిగి పట్టు బిగించడం లక్ష్యాలుగా ప్రచార పర్వాన్ని ఒంటిచేత్తో ముందుకు తీసుకువెళుతున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే సగానికి పైగా సీట్లకు (303) పోలింగ్ ముగిసిపోయింది. ఈ సారి ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేస్తున్న అడుగుల్ని నిశితంగా పరిశీలిస్తే ఆయన పక్కా లెక్కలు వేసుకొని బరిలోకి దిగినట్టు అర్థమవుతుంది. మోదీ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న రాష్ట్రాలు, ప్రచారం చేస్తున్న నియోజకవర్గాలు, అక్కడి అభ్యర్థుల్ని పరిశీలిస్తే మోదీ ప్రచారం ఉద్దేశాలేంటో స్పష్టంగా తెలుస్తాయి. బీజేపీని విస్తరించాలని భావించే రాష్ట్రాలు, గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన నియోజకవర్గాలు, సొంతరాష్ట్రమైన గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నియోజకవర్గాలపై మోదీ ప్రత్యేక దృష్టి సారించారు. అంతేకాదు ప్రతిపక్ష పార్టీలు గట్టి పోటీ ఇస్తున్న ప్రాంతాల్లోనూ ర్యాలీలు నిర్వహించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.
మార్చి 28 నుంచి ఏప్రిల్ 23 వరకు మోదీ ప్రచారం సాగిందిలా ..
పశ్చిమ బెంగాల్, ఒడిశా
కేవలం ఉత్తరాది రాష్ట్రాలపైనే ఆధారపడకుం డా తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని బీజేపీ ఎప్పట్నుంచో వ్యూహరచన చేస్తోంది. వాటిల్లో పశ్చిమబెంగాల్, ఒడిశా రా ష్ట్రాలు అత్యంత ముఖ్యమైనవి. గత అయిదేళ్లలో నే ఈ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని పెం చారు. ఇప్పుడు ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో (ఇక్కడ ఏడుదశల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి) ఇప్పటివరకు ఆరు ర్యాలీల్లో ప్రధాని పాల్గొన్నారు ఒడిశాలో నాలుగు రోజులు మకాం వేసి 8 ర్యాలీల్లో ప్రసంగించి ప్రజల్ని ఉర్రూతలూగించారు.
కర్ణాటక
కర్ణాటకలో బీజేపీ మరింతగా బలోపేతం కావల్సిన అవసరాన్ని గుర్తించిన మోదీ మూడు ప్రాంతాల్లో, ఏడు ర్యాలీల్లో పాల్గొన్నారు. చిక్కోడి, గంగావతి (రాయచూర్), చిత్రదుర్గ. ఈ మూడు చోట్ల గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే చిక్కోడి, చిత్రదుర్గలో బీజేపీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. అందుకే మోదీ అక్కడికి వెళ్లి మరీ ప్రచారం చేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రాభవం ఉన్న మైసూర్, బాగల్‌కోట్‌లకి వెళ్లి తన ప్రసంగాలతో ప్రజలని ఆకట్టుకోవాలని ప్రయత్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బాగల్‌కోట్‌లో సిద్దరామయ్య, బీజేపీ అ«భ్యర్థి బి.శ్రీరాములు మధ్య హోరాహోరీ పోరాటం సాగింది. చివరికి సిద్దరామయ్య స్వల్ప ఓట్ల తేడాతో నెగ్గారు. లోక్‌సభ ఎన్నికల్లో బాగల్‌కోట్‌లో పాగా వేయాలన్న ఉద్దేశంతోనే మోదీ అక్కడ విస్తృతంగా ప్రచారం చేశారు.
మహారాష్ట్ర
మహారాష్ట్రలో మరింత కష్టపడితే తప్ప విజయం దక్కే అవకాశాలు లేని ప్రాంతాలను గుర్తించి ప్రధాని సుడిగాలి ప్రచారం చేశారు. మొత్తం ఏడు ప్రాంతాల్లో పర్యటించారు. దిండోరిలో బీజేపీకి గట్టి పట్టు ఉన్నప్పటికీ ఎన్సీపీ నుంచి బీజేపీలో చేరి పోటీకి దిగిన భారతి పవార్ కొత్త అభ్యర్థి కావడంతో ప్రచారానికి వెళ్లారు. ఇక కాంగ్రెస్ నేతలు బలంగా ఉన్న అహ్మదానగర్, వార్దా, నందర్బార్, లాతూర్ (విలాస్‌రావు దేశ్‌ముఖ్–శివరాజ్ పాటిల్ వారసత్వం), నాందేడ్ (అశోక్ చవాన్‌కి పట్టున్న ప్రాంతం)లో ర్యాలీలు నిర్వహించారు.
సొంత గడ్డ నుంచే మోదీ పాఠాలు
మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నెగ్గినప్పటికీ రాహుల్ గాంధీయే హీరో అన్న ఇమేజ్ వచ్చింది. పాటీదార్ల ఉద్యమం, సౌరాష్ట్ర ప్రాంతంలో గ్రామీణ సంక్షోభం బీజేపీకి చెమట్లు పట్టించాయి. పట్టణ ఓటర్లు బీజేపీని ఆదుకోకపోతే ఫలితం మరోలా ఉండేది. అందుకే మోదీ ఈ సారి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. గుజరాత్‌లో 7 ర్యాలీలు నిర్వహించారు. వాటిల్లో ఆరింటిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినవే. జునాగఢ్, సోనాగఢ్, హిమ్మత్‌నగర్, సురేంద్రనగర్, ఆనంద్, అమ్రేలి, పాటణ్‌లో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రచార భారాన్ని మోదీయే మోశారు. యూపీ, బీహార్‌లో చెరో ఆరు ర్యాలీల్లో పాల్గొన్నారు.
మోదీ ప్రచారానికీ ఓ లెక్కుంది!
Published Sat, Apr 27 2019 2:43 AM | Last Updated on Sat, Apr 27 2019 5:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment