సాక్షి, అమరావతి : డా.వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చేపట్టిన ‘జల యజ్ఞం’ ప్రాజెక్టుల్లో ప్రధానమైనది పోలవరం. మిగతావాటి అన్నింటి కంటే బృహత్తరమైనది కావడంతో ఆయన దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అప్పటివరకు కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో ఆచరణ రూపంలోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా కేంద్ర జల సంఘం, అటవీ, పర్యావరణ, సహాయ పునరావాస ప్యాకేజీ సహా అవసరమైన అన్ని కీలక అనుమతులు సాధించి పనులకు శ్రీకారం చుట్టారు.
ఐదేళ్లలో రూ.5,135.87 కోట్లు ఖర్చు చేసి 44.84 శాతం పనులు పూర్తి చేశారు. జాతీయ ప్రాజెక్టు హోదా వస్తే నిధుల కొరత అధిగమించవచ్చన్న భావనతో అందుకు అవసరమైన కేంద్ర ప్రణాళిక సంఘ అనుమతి కూడా సాధించారు. కేంద్రం నుంచి నేడో, రేపో ఆ మేరకు ప్రకటన కూడా రానుందనగా ఆయన దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో వంద శాతం ఖర్చుతో ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని విభజన చట్టం సెక్షన్ 90 (1)లో ఆనాటి యూపీఏ–2 ప్రభుత్వం స్పష్టంగా హామీ ఇచ్చింది.
తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. కానీ, విభజన చట్టం ప్రకారం కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు నిర్మాణాన్ని తన ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి దక్కేలా సీఎం చంద్రబాబు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఇందుకు ప్రతిఫలంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ‘ప్రత్యేక హోదా’ను కేంద్రానికి తాకట్టు పెట్టారు. దీనికిముందు వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ప్రాజెక్టుకు చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడ్డారు.
ఇదీ వైఎస్ ముద్ర
2004–05 ధరల ప్రకారం పోలవరం వ్యయం రూ.10,151.04 కోట్లు. బహుళార్ధ సాధక ప్రాజెక్టు కాబట్టి జాతీయ హోదా సాధిస్తే 90 శాతం నిధులను కేంద్రం ఇస్తుంది. దీంతో శరవేగంగా పూర్తి చేయొచ్చని వైఎస్ భావించారు. నిబంధనల మేరకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలంటే అన్ని అనుమతులుండాలి. దాంతో ‘సైట్ క్లియరెన్స్’ను సెప్టెంబరు 19, 2005న, అటవీ పర్యావరణ అనుమతిని అక్టోబర్ 25, 2005న, అభయారణ్య అనుమతిని జూలై 6, 2007న, సహాయ పునరావాస ప్యాకేజీకి ఏప్రిల్ 17, 2007న అనుమతి సాధించారు.
కేంద్ర ప్రణాళిక సంఘం అనుమతి ఒక్కటీ వస్తే కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం ఖాయం. దానికోసం ఓవైపు ప్రయత్నిస్తూనే మరోవైపు ప్రాజెక్టు పనులకు రాష్ట్ర బడ్జెట్ నుంచే నిధులు సర్దుబాటు చేశారు. జలాశయం నిర్మాణంతో ముంపునకు గురయ్యే భూమిలో సింహభాగం, కుడి, ఎడమ కాలువల పనుల కోసం అవసరమైన భూమిలో 80 శాతం సేకరించారు. దీంతో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు పన్నాగాలకు తెరతీశారు. కుడి కాలువ తవ్వకానికి అవసరమైన భూ సేకరణకు వ్యరేతికంగా కోర్టును ఆశ్రయించేలా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని రెండు మండలాలకు చెందిన తన సామాజికవర్గ రైతులను రెచ్చగొట్టారు.
అయినా సరే వైఎస్... కుడి కాలువను 145 కి.మీ. పొడవునా, ఎడమ కాలువను 134 కి.మీ. పొడవునా లైనింగ్ సహా పూర్తి చేశారు. హెడ్ వర్క్స్ (జలాశయం) పనులకు ప్రయత్నిస్తూనే ఫిబ్రవరి 25, 2009న కేంద్ర ప్రణాళిక సంఘ అనుమతిని సాధించారు. మరే ఆటంకం లేకపోవడంతో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇంతలోనే 2009 ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో అది వాయిదా పడింది. ఆ ఎన్నికల్లో వైఎస్ గెలవడం, ఒకట్రెండు రోజుల్లో పోలవరానికి జాతీయ హోదా ప్రకటన చేయడానికి కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో అమరుడయ్యారు.
మహా నేత సంకల్పం
వైఎస్ చాలా ముందుచూపుతో పోలవరాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 194.6 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. కుడి కాలువ ద్వారా రోజూ 17,633 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 17,561 క్యూసెక్కులు తరలించవచ్చు. 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందిస్తూ, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. విశాఖపట్నం నగర పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చడమే కాక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 8 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వొచ్చు. 960 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి చేయవచ్చు. గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమూ పోలవరంతోనే సాధ్యం.
వైఎస్ ఏం చేశారు?
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి నదిపై ప్రాజెక్టు నిర్మాణ పనులను 2005లో దివంగత మహానేత వైఎస్ ప్రారంభించారు. వాటికి సమాంతరంగా కుడి,
ఎడమ కాలువ పనులు చేపట్టారు.
- తద్వారా తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారానికి నడుంబిగించారు.
- 2005లో రూ.10,151 కోట్ల అంచనా వ్యయంతో పనులు మొదలుపెట్టారు.
- ప్రణాళిక ప్రకారం వెళ్తూ ప్రాజెక్టుకు అడ్డంకులు రాకుండా చూశారు.
- రూ.5,135.87 కోట్లతో 44.84 శాతం పనులు పూర్తి చేయించారు.
- జాతీయ ప్రాజెక్టు హోదా సాధనకు అన్ని అనుమతులు వచ్చేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
– ఆలమూరు రామగోపాల్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment