
పిరికి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా
సాక్షి నెట్‌వర్క్, అమరావతి: వైఎస్ జగన్‌పై జరిగిన పిరికి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్యం బలపడదు. వైఎస్ జగన్ వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నా.
– మురళీధరరావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇది ప్రణాళిక ప్రకారం జరిగిన దాడి
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి అమానుషం. ఏమరుపాటుగా ఉంటే మెడ లేదా గుండెకు కత్తి తగిలి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. ఇది ప్రణాళిక ప్రకారం జరిగిన దాడి.
– విష్ణుకుమార్‌రాజు, బీజేపీ శాసనసభాపక్ష నేత.
ఘటనపై సమగ్ర విచారణ జరగాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం సంఘటనపై సమగ్ర విచారణ చేసి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి.
– పవన్ కళ్యాణ్
జగన్‌పై దాడి అమానుషం
ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో దాడి చేయడం అమానుషం. ఇలాంటి దాడులు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
– బీవీ రాఘవులు, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు
జగన్ భద్రతను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది
ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రత, రక్షణ చర్యలను పటిష్టం చేయాలని గతంలో తాము చేసిన అనేక విజ్ఞప్తులను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. జగన్ ప్రయాణించే వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతూ మొరాయిస్తున్నా.. తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం వెనుక ప్రభుత్వం ఉద్దేశం ఇదేనా? జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై విచారణ చేయకముందే డీజీపీ చేసిన వ్యాఖ్యలతో కుట్రను నీరుగార్చే ఉద్దేశం స్పష్టంగా తెలుస్తోంది.
– వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
ఇది పిరికిపందల చర్య: ఓవైసీ
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది పిరికిపందల చర్య. వైఎస్ జగన్‌పై దాడి పూర్తిగా భద్రతా వైఫల్యమే. విమానయాన శాఖా మంత్రి సురేష్ ప్రభు దీనిపై వెంటనే విచారణ జరిపించాలి.
– ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ
జ్యుడిషియల్ విచారణ చేపట్టాలి
విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడిపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలి. పటిష్ట భద్రత ఉన్న విమానాశ్రయంలోకి కత్తి ఏవిధంగా తీసుకెళ్లారో విచారణ
–పి. మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
పెద్ద ప్రమాదం తప్పింది
మెడపై నరం తెగి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. సర్జికల్ కత్తిలా కోడి పందేల కత్తి షార్ప్‌గా ఉంటుంది. పీక కోయాలనేదే అతని ఉద్దేశని కొందరు అంటున్నారు. భుజం మీద తగలడంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
– ఉండవల్లి
జగన్‌పై దాడికి పాల్పడిన వ్యక్తిని ఉరి తీయాలి
విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి అత్యంత దుర్మార్గమైన చర్య.
– రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్
కుట్ర కోణంలో దర్యాప్తు చేయాలి
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ దాడి వెనుక కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేయాలి.
– కాంగ్రెస్ నేతలు రఘవీరారెడ్డి, ఊమెన్ చాంది, కేవీపీ
ఇదంతా ‘బాబు’ కుట్రలా కనిపిస్తోంది
జగన్‌పై హత్యాయత్నం జరిగిన సమయంలో ఆయనకు కుడివైపున నేను ఉన్నా. కళ్లెదుటే ఓ యువకుడు సెల్ఫీ కావాలంటూ వచ్చి కత్తితో దాడికి దిగాడు. ఇదంతా బాబు కుట్రలా కనిపిస్తోంది.
–ఎమ్మెల్యే రాజన్నదొర
జగన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ఫోన్‌లో పరామర్శించారు. విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్‌పై అగంతకుడు జరిపిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయం తీవ్రతను తెలుసుకుని, చికిత్స అందుతున్న విధానంపై వివరాలు అడిగారు. తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. జగన్ త్వరగా కోలుకోవాలని కేసీఆర్ ఆకాక్షించారు.
పలువురు నేతల ఖండన
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడిని పార్టీలకు అతీతంగా పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులంతా వ్యతిరేకించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. జగన్‌పై దాడిచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, జగన్ త్వరగా కోలుకోవాలని మంత్రి కేటీఆర్ ట్వీట్టర్‌లో ఆకాంక్షించారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.
జగన్‌పై హత్యాయత్నం దుర్మార్గపు చర్య
సినీ నటుడు మోహన్‌బాబు
చంద్రగిరి: ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కష్టపడుతున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరగడం దుర్మార్గపు చర్య అని సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ మంచు మోహన్ బాబు అన్నారు. కోడి కాలుకు కట్టే కత్తితో దాడి చేయడం వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన గురించి తెలియగానే తాను చలించిపోయానన్నారు.
జగన్‌పై దాడి దుర్మార్గపు చర్య
చేజర్ల: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి దుర్మార్గపు చర్య. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి. సమగ్ర దర్యాప్తు జరిగితేనే ఈ ఘటన వెనుక ఎవరి కుట్ర ఉందో తెలుస్తుంది.
– నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహనరెడ్డి
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దాడి
పుంగనూరు: రాష్ట్రంలో అత్యంత ప్రజాధరణ కలిగిన ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి రక్షణ కరువయ్యింది. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దాడి జరిగింది. ప్రజాస్వామ్యంలో దాడులతో ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని చూస్తే ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారు. ఇలాంటి చర్యలకు భయపడే ప్రసక్తే లేదు.
–ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చంద్రబాబు స్క్రిప్ట్ డీజీపీ చెప్పడమేనా దర్యాప్తు?
గోపాలపట్నం (విశాఖపట్నం): నిందితుడిని, సాక్షులను విచారించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ డీజీపీ చెప్పడమేనా పోలీసు దర్యాప్తు. డీజీపీ వ్యవహార ధోరణితో పోలీసు శాఖపై ప్రజలకు పూర్తిగా విశ్వాసం పోయింది. డీజీపీ ప్రకటనలు కేసు దర్యాప్తు పక్కదారి పట్టించేలా ఉన్నాయి.
–వైఎస్సార్ సీపీ నేత బొత్ససత్యన్నారాయణ
సీసీ ఫుటేజీ లేదంటే ఎలా?
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ అడిగితే లేదని చెబుతుండటం దారుణం. కట్టుదిట్టమైన భద్రత ఉంటే ఎయిర్‌పోర్టులోకి ఒక పదునైన కత్తిని ఎలా తీసుకొచ్చారో ప్రభుత్వం చెప్పాలి. ఆ కత్తి మెడకు తగిలి ఉంటే ఏమై ఉండేదో ఊహించుకోవడానికే భయమేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తన భద్రతా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాజకీయాలు మాట్లాడటం దారుణం. ఎయిర్‌పోర్టు లోపల జరిగిన సంఘటనతో తమకు సంబంధం లేదంటూ ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పడం నీచమైన చర్య. బాధాకరమైన ఘటన జరిగితే సానుభూతి తెలుపకపోగా టీడీపీ నేతలు నీచ రాజకీయాలకు పాల్పడడం సిగ్గుచేటు.గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా అలిపిరిలో దాడి జరిగితే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్. రాజశేఖర్‌రెడ్డి తిరుపతి వెళ్లి పరామర్శ చేసిన విషయం బాబుకు గుర్తురాలేదా?ఇప్పుడు క్యాంటిన్‌లో పనిచేసే వ్యక్తే ఇలా చేస్తే రేపు జగన్ పాదయాత్ర చేస్తుంటే ఏమి జరుగుతుందోనని భయమేస్తోంది.
–మాజీ ఎంపీ మిధున్‌రెడ్డి
ఆపరేషన్ గరుడలో భాగంగానే దాడి.. మంత్రుల ఆరోపణ
సాక్షి, అమరావతి : సినీ నటుడు శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడలో భాగంగానే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి జరిగిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. ఈ దాడి రాజకీయ కుట్ర అని ఆరోపించారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు సీఐఎస్‌ఎఫ్ పరిధిలోని ఉందని, అక్కడ జరిగిన దాడి తమ పరిధిలోకి రాదన్నారు. దాడి జరిగిన గంటలోనే గవర్నర్ నరసింహన్ ఆఘమేఘాలపై డీజీపీకి ఫోన్‌చేసి నివేదిక ఇవ్వమనడం ఏమిటని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. డీజీపీకి ఫోన్ చేసే హక్కు గవర్నర్‌కు లేదని, చేస్తే ముఖ్యమంత్రికి చేయాలని చెప్పారు.
శ్రీనివాసరావుకి పార్టీతో సంబంధం లేదు
ముమ్మిడివరం: హత్యాయత్నానికి పాల్పడిన జనిపెల్ల శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడని కొన్ని ప్రసార మాధ్యమాలు, అధికార పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదు. అతను ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన లేదు. పార్టీ జెండా పట్టుకున్న సందర్భాలు కూడా లేవు.
– జగతా పద్మనాభం(బాబ్జీ) ముమ్మిడివరం మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment