‘దశాబ్ద’ కీర్తి.. ప్రగతి స్ఫూర్తి | Political Parties Target to Chevella Constituency | Sakshi
Sakshi News home page

‘దశాబ్ద’ కీర్తి.. ప్రగతి స్ఫూర్తి

Published Mon, Mar 18 2019 9:11 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Political Parties Target to Chevella Constituency  - Sakshi

పచ్చని పల్లె సీమలు, ఆధునిక పట్టణాల కలబోతగా కనిపించే ప్రాంతం చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం. దశాబ్ద చరిత్ర కలిగిన ఈ సెగ్మెంట్‌ పరిధిలో దేశానికి అన్నం పెట్టే రైతులు, రైతు కూలీలు ఓ వైపు.. ప్రపంచ దేశాల సరసన నిలిపిన ఐటీ, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు మరోవైపు కొలువుదీరాయి. ప్రతిష్టాత్మక ఫార్మా సిటీ, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్, హార్డ్‌వేర్‌ పార్కులతో పాటు రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ అంతర్జాతీయ సంస్థలను ఒడిలో పెట్టుకుంది. ఇంతటి ప్రాధాన్యం ఉండడంతో ఇక్కడి నుంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి.

సాక్షి, రంగారెడ్డి జిల్లా :ఒకవైపు పల్లె సీమలు.. మరోవైపు ఆధునికతకుఅద్దం పట్టే పట్టణాల కలబోత చేవెళ్ల లోక్‌సభ. దశాబ్ద చరిత్ర కలిగిన ఈ లోక్‌సభపరిధిలో దేశానికి అన్నం పెట్టే రైతులు, రైతు కూలీలు ఓ వైపు ఉండగా.. మరోవైపు ప్రపంచ దేశాల సరసన నిలిపిన ఐటీ,సాఫ్ట్‌వేర్‌ కంపెనీలుకొలువుదీరాయి. ప్రతిష్టాత్మక ఫార్మా సిటీ, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్, హార్డ్‌వేర్‌ పార్కులతో పాటు ఉన్నత విద్యా సంస్థలు,వర్సిటీలు, పర్యాటక, ఆతిథ్యానికి కేంద్ర బిందువు ఈ లోక్‌సభ స్థానం. నిర్మాణ, రియల్‌ ఎస్టేట్‌ రంగాలను, అంతర్జాతీయ సంస్థలకు ఆలవాలమైన ఈ ప్రాంతం ఉద్యోగ, ఉపాధిఅవకాశాలకూ కొదవలేదు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, పేరెన్నికగన్న స్టార్‌ హోటళ్లు ఇక్కడ వెలిశాయి. ఈ లోక్‌సభ సెగ్మెంట్‌ ఆవిర్భవించి పదేళ్లే అయినా.. అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దీని సొంతం. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి ఇక్కడ పాగా వేసేందుకు ప్రధాన పార్టీలన్నీ  వ్యూహరచన చేస్తున్నాయి. 

చేవెళ్ల లోక్‌సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో వికారాబాద్‌ జిల్లా పరిధిలో వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలు ఉండగా.. రంగారెడ్డి జిల్లాలోనివి  శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవెళ్ల సెగ్మెంట్లు. ఈ ఏడు సెగ్మెంట్లు కూడా గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొనసాగాయి. ఇటీవల జరిగిన జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో ఈ నియోజకవర్గాల్లో కొన్ని కొత్త రంగారెడ్డి, ఇంకొన్ని వికారాబాద్‌ జిల్లాల్లోకి వెళ్లాయి. గతంలో ఈ విధానసభ స్థానాలు హైదరాబాద్, మెదక్‌ లోక్‌సభల్లో అంతర్భాగంగా కొనసాగాయి. లోక్‌సభ స్థానాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 2008లో చేవెళ్ల లోక్‌సభ ఆవిర్భవించింది.  

చెరోసారి గెలుపు
చేవెళ్ల లోక్‌సభ స్థానానికి ఇప్పటివరకు రెండుసార్లు ఎన్నికలు జరగాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ చెరోసారి
కైవసం చేసుకున్నాయి. 2009లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో మొత్తం ముగ్గురు అభ్యర్థులే తలపడ్డారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సూదిని జైపాల్‌రెడ్డి విజయం సాధించారు. సమీప టీడీపీ అభ్యర్థి ఏపీ జితేందర్‌రెడ్డిపై ఆయన 18,532 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2014లో జరిగిన పోరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ యువనేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డిపై విజయఢంకా మోగించారు. కార్తీక్‌పై 73,023 ఓట్ల ఆధిక్యాన్ని కనబర్చారు. మొత్తం 13 మంది ఈ స్థానానికి పోటీ చేయగా.. ఇందులో ఒకరు స్వతంత్ర అభ్యర్థి కాగా మిగిలిన వారు ప్రధాన, చిన్నాచితక పార్టీల అభ్యర్థులు.  

మూడోసారిపాగావేసేదెవరో?
చేవెళ్ల లోక్‌సభకు మూడోసారి జరగనున్న ఎన్నికల్లో ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు సై అంటున్నాయి. మొన్నటి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లారు. ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆయనను.. కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక టీఆర్‌ఎస్‌ నుంచి పారిశ్రామికవేత్త డాక్టర్‌ జి.రంజిత్‌ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. నేడో రేపో ఆయన పేరును ప్రకటించే అవకాశముంది. ఇక బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి, బెక్కరి జనార్దన్‌రెడ్డి, గజ్జల యోగానంద్‌ పేర్లు పరిశీలనో ఉన్నట్లు సమచారం.  

బైండోవర్‌ అంటే..!
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల సమయంలో పోలీసుల నోటి వెంట తరచుగా వినిపించే మాట ‘బైండోవర్‌’. చాలామంది ఓటర్లకు బైండోవర్‌ అంటే ఏమిటో తెలియదు. బైండోవర్‌ అంటే బాండ్‌ ఫర్‌ గుడ్‌ బిహేవియర్‌. ఎన్నికల వేళ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు పాత నేరస్తులను అదుపులోకి తీసుకుంటారు. రౌడీషీటర్లు, సారా తయారీదారులు, అమ్మకందారుల, బెల్ట్‌షాపుల నిర్వాహకులతో పాటు వివిధ కేసుల్లో ఉన్న నిందితులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి  బైండోవర్‌ కేసులు పెడుతుంటారు.అనంతరం వారిని తహసీల్దార్, ఆర్డీఓ ఎదుట హాజరుపరుస్తారు. సీఆర్‌పీసీ 107, 108, 109, 110 సెక్షన్ల కింద బైండోవర్‌ చేసి తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేస్తారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడబోమని వీరు తహసీల్దార్‌ దగ్గర బాండ్‌ పేపర్‌పై లిఖితపూర్వక హామీ ఇవ్వాలి. కొంత మొత్తం నగదు లేదా స్థిరాస్తి ష్యూరిటీ చూపించాల్సి ఉంటుంది. బైండోవర్‌ అయిన వ్యక్తులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకుపాల్పడినా ష్యూరిటీ పెట్టిన సొమ్ము నుంచి వసూలు చేస్తారు. వీరు ఎన్నికల వేళ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమ అధీనంలోనే ఉంచుకుంటారు.

చేవెళ్ల లోక్‌సభ పరిధిలోనిఅసెంబ్లీ సెగ్మెంట్లు
శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు
మొత్తం ఓటర్లు : 24,15,598
పురుషులు : 12,51,210
మహిళలు : 11,64,093

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement