మారిన రాజకీయం | Political Parties Working Hard For Local Elections In Adilabad | Sakshi
Sakshi News home page

మారిన రాజకీయం

Published Sun, Jul 14 2019 11:29 AM | Last Updated on Sun, Jul 14 2019 11:55 AM

Political Parties Working Hard For Local Elections In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: బల్దియా పోరు ఆసక్తికరంగా మారుతోంది. త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించనుండగా ప్రధానంగా జిల్లాలోని ఏకైక ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. రిజర్వేషన్లపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. 2014లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికలకు రాబోయే ఈ ఎన్నికలకు రాజకీయం మారింది. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు, స్వంతంత్ర కౌన్సిలర్లుగా గెలిచిన వారు అప్పట్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. దీంతో ప్రతిపక్షాల బలం నీరుగారిపోయింది. ఈ ఎన్నికల్లో మళ్లీ అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీ లు ఏమేర సత్తా చూపుతాయానేది ఆసక్తికరం.

ఉమ్మడి రాష్ట్రంలో 2014లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేసింది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ జూలై 2తో పాలకవర్గం పదవీకాలం పూర్తయింది. కాగా అప్పట్లో 36 వార్డులున్న ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ 14, ఎంఐఎం 4, స్వతంత్రులు 4, కాంగ్రెస్, బీజేపీ చెరో ఏడు స్థానాలు దక్కించుకున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎంఐఎం మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులను కలుపుకుని అప్పట్లో కొలువుదీరింది.

21వ వార్డు కౌన్సిలర్‌ రంగినేనీ మనీశ చైర్‌పర్సన్‌గా, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, 29వ వార్డు కౌన్సిలర్‌ ఫారూఖ్‌ అహ్మద్‌ వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఐదేళ్లపాటు పదవుల్లో కొనసాగారు. కాగా కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, స్వతంత్ర కౌన్సిలర్లు నలుగురు అధికార పార్టీలో చేరడంతో మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ బలం పెరిగిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీల సంఖ్య పలచబడిపోయింది. ఈ నేపథ్యంలో జరగనున్న ఎన్నికల్లో ఆయా పార్టీలు ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది పట్టణ ప్రజల్లో ఆసక్తి కలిగిస్తోంది. 

రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ 
ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ 36 వార్డుల నుంచి ప్రస్తుతం 49 వార్డులకు పెరిగింది. మావల గ్రామం వదిలి దాని పరిధిలోని మిగిలిన కాలనీలు, అనుకుంట, బంగారుగూడ, రాంపూర్, బట్టి సావర్గాం గ్రామాన్ని వదిలి దాని పరిధిలోని కాలనీలు పట్టణంలో విలీనం అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం చూపించగా, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కొత్త వార్డుల్లో గతంలో జెడ్పీటీసీ, ఎంపీపీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లుగా పని చేసిన వారు ఈ పురపాలిక ఎన్నికల్లో నిలబడేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్, బీజేపీ నుంచి అధికంగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతుండగా, కాంగ్రెస్‌ కొంత లేకపోలేదు. ఇక కొన్ని వార్డుల్లో ఎంఐఎం పార్టీ ప్రభావం ఉంది. ఈ నేపథ్యంలో జరగబోయే ఎన్నికల్లో ఒక పార్టీ మెజార్టీ సాధించేందుకు శాయశక్తులగా కృషి చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 25 వార్డుల్లో విజయకేతనం ఎగురవేస్తేనే పాలకవర్గం దక్కుతుంది. లేని పక్షంలో మిత్ర పక్షాల సహకారంతోనైనా పార్టీలు కొలువుదీరే పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న తనయుడు జోగు ప్రేమేందర్‌ ఈ ఎన్నికల ద్వారా పుర రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు. తద్వారా టీఆర్‌ఎస్‌ గెలుపుపై వారు ఆశలు పెట్టుకున్నారు. కాగా ఆయా పార్టీలు ఇప్పటికే వార్డులలో ఒక అంచనాతో ముందుకు కదులుతున్నాయి.

దాని ప్రకారం రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే వారే అభ్యర్థులుగా ఉంటారు. లేనిపక్షంలో పార్టీలకు అభ్యర్థులను వడపోసి ఎంపిక చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ నుంచి రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. పార్టీలు కసరత్తు మొదలు పెట్టినా పలు వార్డులలో కొన్ని పార్టీలకు సరైన అభ్యర్థులకు కూడా కరువయ్యే పరిస్థితి లేకపోలేదు. గత ఎన్నికల్లో 34న వార్డు నుంచి మెస్రం కృష్ణ ఏకగ్రీవంగా కౌన్సిలర్‌గా ఎన్నిక కావడం ఈ పరిస్థితిని తేటతెల్లం చేస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement