
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొని ఉనికి చాటేందుకు ప్రతిపక్ష పార్టీలు రెండూ తమ శక్తియుక్తులకు పదను పెడుతున్నాయి. ఆరేళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతున్న గులాబీ జైత్రయాత్రకు బ్రేక్ వేయడం ద్వారా ప్రత్యామ్నాయంగా తమ శక్తిని చాటాలని కాంగ్రెస్, బీజేపీ తహతహలాడుతున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లుపై దేశంలో పెల్లుబుకుతున్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని భావిస్తున్న కాంగ్రెస్, పట్టణ ప్రాంతాల్లో మైనారిటీలు, విద్యావంతులను ఆకర్షించి మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తోంది.
ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసకృష్ణన్ నేతృత్వంలో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల నేతలు సమావేశమై మునిసిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అదే సమయంలో దేశంలో ప్రధాని మోదీ నేతృత్వంలో సాధిస్తున్న అనూహ్య విజయాలు పురపాలక ఎన్నికల్లో అనుకూలిస్తాయని బీజేపీ భావిస్తోంది. పౌరసత్వ సవరణ బిల్లుపై టీఆర్‌ఎస్, కాంగ్రెస్ వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడం తమకే లబ్ధి చేకూరుతుందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల నాటి ఫలితాలు పునరావృతం అవుతాయని, మెజారిటీ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉన్నారు. కాగా టీఆర్‌ఎస్ మాత్రం తమకు అడ్డులేదనే ధీమాతో ప్రతీ మునిసిపాలిటీ, కార్పొరేషన్‌లో దూసుకుపోతుండడం గమనార్హం.
కాంగ్రెస్ కోలుకొనేనా..?
తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉనికికి ప్రమాదం ఏర్పడింది. వరుస పరాజయాలతో ఆపార్టీ దీనస్థితికి చేరుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు తారుమారు కాగా, పార్లమెంటు ఎన్నికల్లో సైతం తేరుకోలేదు. జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు ఘోర పరాజయాన్నే మిగిల్చాయి. దీంతో పార్టీ యంత్రాంగంలో నైరాశ్యం చోటుచేసుకుంది. ఈ పరిస్థితుల్లో గత మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా అధికార పార్టీ నీడకు చేరారు. ప్రస్తుతం పార్టీకి జిల్లా, నియోజకవర్గస్థాయిలో ఒకరిద్దరు నాయకులు తప్ప పట్టణాల్లోని వార్డుల్లో అభ్యర్థిత్వాన్ని ఆశించే వారు తగ్గిపోతున్నారు.
ఈ నేపథ్యంలో నష్ట నివారణకు పార్టీ నేతలు నడుం కట్టారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గస్థాయిలో జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసకృష్ణన్, జిల్లాకు చెందిన రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు శనివారం సమావేశమయ్యారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కరీంనగర్ నుంచి పోరాటం చేయడమేగాకుండా పార్టీని మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం చేసే అంశంపై సుధీర్ఘంగా చర్చించారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 14 మున్సిపాలిటీలతోపాటు మంచిర్యాల జిల్లాలో ఉన్న ఏడు మున్సిపాలిటీల్లో పార్టీకి విజయాలు అందించేందుకు స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పొన్నం ప్రభాకర్, జీవన్‌రెడ్డి, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో శ్రీధర్‌బాబు, కొక్కిరాల ప్రేంసాగర్‌రావు వంటి నేతలు ప్రధానంగా దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే విషయంలో బీజేపీ కూడా తమకు పోటీగా రావడం ఆపార్టీ నేతలకు మింగుడు పడడం లేదు.
మోదీ హవాపై బీజేపీ ఆశలు
పార్లమెంటు ఎన్నికల నాటి నుంచి బీజేపీ ప్రధాని మోదీ హవాపైనే ఆశలు పెట్టుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో విజయాలు సాధించినప్పటికీ... పార్టీని క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేయడంలోగానీ, ప్రజలను బీజేపీవైపు ప్రభావితం చేయడంలోగానీ పెద్దగా కృషి జరగలేదు. పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ స్థానాన్ని అనూహ్యంగా గెలుచుకున్న బీజేపీ నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ సాధించింది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జగిత్యాల, కోరుట్ల స్థానాల్లో కూడా బీజేపీ టీఆర్‌ఎస్ ఓటుబ్యాంకుకు దెబ్బ కొట్టింది.
పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో మాత్రం మూడోస్థానానికి పరిమితమైంది. ఈ ఎన్నికల తరువాత జరిగిన జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో మాత్రం ఎక్కడా ఉనికి చాటుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో పట్టణాల్లో జరిగే మునిసిపల్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు సాధిస్తుందనేదే వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ పరిధితో పాటు వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి, జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, రాయికల్ మున్సిపాలిటీల పరిధిలో బీజేపీకి మెజారిటీ ఓట్లు లభించాయి. ఈసారి ఈ మున్సిపాలిటీల్లో విజయాన్ని సొంతం చేసుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికల తరువాత ఆ ఊపును కొనసాగించడంలో పార్టీ నాయకులు పెద్దగా ఆసక్తి చూపిన దాఖలాలు లేవు.
పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్యపోరు పార్టీని ఎదగనీయలేదనే అపవాదు ఉంది. ఈ నేపథ్యంలో కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటు స్థానాల పరిధిలో బీజేపీ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందనే ఆసక్తి నెలకొంది. పెద్దపల్లి పార్లమెంటు స్థానం పరిధిలో మాజీ ఎంపీ వివేక్ , మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీలో చేరడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఈ ఎన్నికల్లో స్పష్టం కానుంది.