పొలిటికల్‌.. హీట్‌! | Political Heat For Local Elections In Nalgonda | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌.. హీట్‌!

Published Sun, Jul 14 2019 7:37 AM | Last Updated on Sun, Jul 14 2019 7:37 AM

Political Heat For Local Elections In Nalgonda - Sakshi

సాక్షి, నల్లగొండ : మరోమారు జిల్లా రాజకీయంగా వేడెక్కుతోంది. మున్సిపల్‌ ఎన్నికలకు ప్రభుత్వం తెర లేపడంతో ఆయా పార్టీల రాజకీయ కార్యాచరణ కూడా షురూవైంది. మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన తదితర పనులతో మున్సిపల్‌ అధికార యంత్రాంగం తీరిక లేకుండా గడుపుతోంది. మరోవైపు అధికార టీఆర్‌ఎస్‌ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా ఆయా మున్సిపాలిటీల్లో అధికారిక కార్యక్రమాలు చేపడుతోంది. ఇంకా మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకపోవడం, ఎన్నికల నియమావళి (కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) అమల్లోకి రాకపోవడంతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో హల్‌చల్‌ చేస్తోంది.

ఇప్పటికే జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొనగా రెండు రోజులపాటు వివిధ పనుల పేర సాధ్యమైనన్ని వార్డుల్లో కార్యక్రమాలు చేపట్టారు. ఫలితంగా పట్టణాల్లో ఒక్కసారిగా రాజకీయ సందడి పెరిగిపోయింది. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ మున్సిపాలిటీలతో పాటు కొత్తగా ఏర్పాటైన నందికొండ, హాలియా, చండూరు, చిట్యాల మున్సిపాలిటీల్లో సైతం ఆయా పార్టీల కార్యక్రమాలు మొదలవుతున్నాయి. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ చేరికలకు తెర తీసింది.

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముఖ్యులు కొందరు ఆ పార్టీని వీడి గులాబీ కండువాలు కప్పుకున్నారు. మున్సిపల్‌ ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం కాంగ్రెస్‌కు షాకివ్వగా, టీఆర్‌ఎస్‌కు అదనపు బలం చేకూర్చినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడు మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు టీఆర్‌ఎస్‌ వేగంగా అడుగులు వేస్తోంది.

పునర్విభజన కిరికిరి!
మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. దీంతో అన్ని మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన అనివార్యమైంది. అధికార పార్టీ తనకు అనుకూలంగా వార్డులను పునర్విభజించిందని కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ తదితర పార్టీలు మండిపడుతున్నాయి. వార్డులకు సరిహద్దులు ఖరారు చేయకుండానే డ్రాఫ్ట్‌ డిక్లరేషన్‌ ఎలా చేస్తారన్న ప్రశ్నకు అధికారులనుంచి సమాధానమే లేదు. వార్డుల్లో ఓటర్ల తారుమారు, వందల సంఖ్యలో ఓట్లు గల్లంతు కావడం, సంబంధం లేకుండా వార్డులను కలపడం, లేదా కొత్తవాటిని తయారు చేయడం వంటి అంశాలపై విపక్షాలు ఆగ్రహంగా ఉన్నాయి. దీంతో మున్సిపల్‌ అధికారులు రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశాలు రసాభాస అయ్యాయి. అధికారులు ప్రస్తుతం చేసిన తప్పులను సరిదిద్దే పనిలో ఉన్నారని చెబుతున్నారు. 

రిజర్వేషన్ల కోసం ఎదురుచూపులు
ఆయా మున్సిపాలిటీల్లో అన్ని పార్టీలూ వార్డుల రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. పాత మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లుగా పనిచేసిన వారు మరోమారు కౌన్సిల్‌లో అడుగు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో తమ పాత వార్డులో రిజర్వేషన్‌ అనుకూలంగా వస్తుందా..? లేదా, పక్క వార్డులోకో, మరో చోటుకు మారాల్సి ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. వార్డుల రిజర్వేషన్లు తేలితే రాజకీయ కార్యక్రమాలు మరింతగా జోరందుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటే మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్లపైనా ఆసక్తి నెలకొంది. 

మొదలవుతున్న నేతల పర్యటనలు
ఆగస్టు నెల ముగిసే లోపు మున్సిపల్‌ ఎన్నికలను ముగించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉండడం, ఆ దిశలో ఎన్నికల నిర్వహణ పనులనూ మొదలు పెట్టడంతో అన్ని పార్టీలు ఎన్నికలకు తయారవుతున్నాయి. మున్సిపాలిటీల వారీగా కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ఇప్పటికే అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాలతో వార్డుల్లో ఎన్నికల వాతావరణాన్ని తీసుకువచ్చింది. ఆ పార్టీ కార్యకర్తలు దీనికి ముందస్తు ప్రచారంగానే భావిస్తున్నారు.

కాగా, కాంగ్రెస్‌ స్థానిక నాయకులు ఎక్కడికక్కడ పనిచేసుకుంటున్నారు. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో మరింతగా బలపడేందుకు, పాగా వేసేం దుకు వ్యూహాలు రచిస్తున్న బీజేపీ మున్సిపల్‌ ఎన్నికలను సీరియస్‌గానే తీసుకుంటోంది. అదే సమయంలో ప్రస్తుతం ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుండడంతో ముఖ్య నేతలు పర్యటించి వెళుతున్నారు. ఇప్పటికే దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ పర్యటించి వెళ్లారు. ఆదివారం జిల్లా కేంద్రానికి మాజీ మంత్రులు, బీజేపీ నేతలు డీకే అరుణ, బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌ రెడ్డి పర్యటనకు వస్తున్నారు. మొత్తంగా జిల్లాలో ఏడు మున్సిపాలిటీల పరిధిలో ఇప్పుడు రాజకీయ హడావిడి మొదలైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement