కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య కుదిరిన చీకటి రహస్య ఒప్పందాన్ని బయటపెట్టాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించడమే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌నే తాట తీస్తా అన్న పవన్ పర్యటనకు ఎర్ర తివాచీలు పరచడం ఏమిటని ప్రశ్నించారు.
తెలంగాణ కోసం పోరాడిన జేఏసీ చైర్మన్ కోదండరాం, పార్లమెంట్‌లో బిల్లును ఆమోదింపజేసిన మాజీ స్పీకర్ మీరాకుమార్‌లు రాష్ట్రంలో పర్యటిస్తే ఆంక్షలు విధించిన ముఖ్యమంత్రి.. పవన్‌పై అమిత ప్రేమ చూపించడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. 2009లో ప్రమాదం జరిగితే ఎనిమిదేళ్ల తరువాత మొక్కులు చెల్లించడానికి వస్తున్నానని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పలు సమస్యలపై ఆందోళన చేస్తున్న ఆయనకు నాలుగేళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వచ్చిన సంకేతాలతోనే పవన్ లాంటి వారిని తెలంగాణలో తిప్పుకుంటూ ప్రజలను గందరగోళంలో పడేయడానికి ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment