పట్నా : రానున్న కాలంలో బీజేపీకి మరో మిత్రపక్షం గుడ్‌బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీతో దశాబ్దాల కాలం పాటు స్నేహం చేసిన శివసేన, టీడీపీ ఇప్పటికే విభేదించి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంతో కేంద్రంపై నితీష్ ఇప్పటికే తీవ్ర అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్‌ఆర్‌సీ ఆందోళనలు దానికి మరింత ఆజ్యంపోశాయి. బిహార్‌లో ఎన్‌ఆర్‌సీ అమలు చేసే ప్రసక్తే లేదని నితీష్ బహిరంగంగానే ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. సీట్ల పంపకాలపై బీజేపీ-జేడీయూలో ఇప్పటికే చర్చలు మొదలైయ్యాయి. ఈ నేపథ్యంలో జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో అసక్తికరంగా మారాయి.
ఆదివారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రశాంత్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకత్వం అంచనాలు వేస్తున్నట్లు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50:50 సీట్ల పంపకాల ఒప్పందం కుదరదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జేడీయూకే సింహాభాగం సీట్లు కేటాయించాలని అన్నారు. సీట్ల ఒప్పందంపై బీజేపీ నేతలు మరోసారి పునపరిశీలన చేసుకోవాలని సూచించారు. అలాగే 1:4 ఫార్మూలాను ఆయన తెరపైకి తీసుకువచ్చారు. అయితే ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. సీట్ల పంపకాలపై ఇరు పార్టీల అధినేతలు నిర్ణయం తీసుకుంటారని, దీనిలో ప్రశాంత్ తలదూర్చడం సరికాదని తప్పపట్టారు. (ఎన్డీయే నుంచి బయటకు రండి.. మద్దతిస్తాం)
గత లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించిన 50:50 ఫార్మూలానే ఈసారి కూడా పాటిస్తామని బీజేపీ నేతలు స్పష్టంచేశారు. దీంతో ప్రశాంత్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పడిప్పుడే గళం విప్పుతున్న నితీష్‌కు అసెంబ్లీ ఎన్నికలు పెద్ద సవాలుగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆర్జేడీ-జేడీయూ మహా ఘట్ బంధన్‌గా ఏర్పడి విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం కూటమికి గుడ్‌బై చెప్పి మళ్లీ బీజేపీతో కలిసిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment