
సాక్షి, ఉత్తరప్రదేశ్: అతని పేరు.. ఫక్కర్ రామాయని. వయసు 73 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్ మధురలోని గాల్టేశ్వర్ ఆలయ ప్రధాన పూజారి అయిన ఈయన 17వ సారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇంతవరకు ఎనిమిది లోక్‌సభ, ఎనిమిది శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ఈ స్వామీజీకి డిపాజిట్ కూడా దక్కలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఇప్పుడు మరోసారి మథుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నామినేషన్ల దాఖలు ప్రారంభం రోజునే ఆయన భక్తులతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.
ఇన్ని ఎన్నికల్లో ఓడిపోయినా తాను నిరాశ పడటం లేదని, ఓటర్లు ఎప్పటికైనా తనను గుర్తిస్తారన్న నమ్మకం ఉందని అంటున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన రామాయని రెండు అంశాల మ్యానిఫెస్టోను కూడా ప్రకటించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం ఒకటయితే, యమునా నదిని కాలుష్యరహితం చేయడం రెండోది. రామాయణాన్ని కంఠతా పట్టేసిన ఈయనకు పెద్దసంఖ్యలో భక్తులు ఉన్నారు. ప్రస్తుతం మోకాలి నొప్పితో బాధపడుతున్నానని, అందువల్ల ప్రచారానికి కారు ఉపయోగిస్తున్నానని ఆయన చెబుతున్నారు. కారు, ఎన్నికల ఖర్చు కూడా ఆయన భక్తులే భరిస్తున్నారట. ఇంతకు ముందులాగే ఇప్పుడు కూడా రామాయని ముందుగా యమునా నదికి హారతి పట్టి ఆ తర్వాత నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 18న మధురలో పోలింగు జరగనుంది.