
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. గంగానదిలో మూడురోజులపాటు బోటులో ప్రయాణించి.. ప్రచారం నిర్వహించిన ఆమె.. ప్రధాని మోదీ నియోజకవర్గమైన వారణాసిలో యాత్ర ముగించారు. ఈ సందర్భంగా ఆమె తన మెడలోని ఓ పూలదండను తీసి.. అక్కడే ఉన్న దివంగత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహం మెడలో వేశారు. ఈ విషయాన్ని వెంటనే గమనించిన బీజేపీ.. ప్రియాంక తన మెడలోని హరాన్ని శాస్త్రి విగ్రహానికి వేసి.. ఆయనను అవమానించారంటూ.. విమర్శల దాడికి దిగింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. ప్రియాంకపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. వినియోగించిన పూలహారాన్ని శాస్త్రి విగ్రహానికి వేసి.. ప్రియాంక ఆయనను అవమానించారని, ఆమె అహంకారానికి ఇది నిదర్శనమని స్మృతి మండిపడ్డారు. బీజేపీ శ్రేణులు కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. విమర్శలు గుప్పిస్తున్నారు. తూర్పు యూపీ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక ప్రజలతో మమేకమయ్యేందుకు, వారితో మాట్లాడేందుకు గంగానదిలో చేపట్టిన బోటు యాత్ర.. బుధవారం ముగిసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment