సాక్షి, న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వత్యిరేకిస్తూ బీసీ సంఘాలు సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. కేంద్రం తీరుపై మండిపడ్డారు. అగ్రకుల పేదల పేరుతో అగ్రకుల ధనికులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, చాతుర్వర్ణ వ్యవస్థను శాశ్వతంగా ఉంచేందుకే ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనలకు అనుగుణంగా ఈ రిజర్వేషన్ తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు. రాజ్యాంగ మూల స్వభావానికి విరుద్ధంగా ఈబీసీ రిజర్వేషన్లు ఇస్తున్నారని అన్నారు.
సమానత్వానికి విరుద్ధంగా అగ్రకుల రిజర్వేషన్ల బిల్లు తెచ్చారని విమర్శించారు. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ నియామకాల్లో 13 పాయింట్ల రిజర్వేషన్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓబీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కులాలవారీగా జనగణన శాస్త్రీయంగా జరగాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని పేర్కొన్నారు. అణగారిన వర్గాలను బానిసలుగా అణగదొక్కేందుకే 10 శాతం ఈబీసీ రిజర్వేషన్‌ను తీసుకొచ్చారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment