సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనంతో నిరుద్యోగం ప్రబలిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏ యూనివర్సిటీనైనా సందర్శించి ఎకానమీ మెరుగుదలకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. నిరుద్యోగానికి దారితీసిన ఆర్థిక వ్యవస్ధ వైఫల్యంపై విద్యార్ధులు, యువత ఆగ్రహంగా ఉన్నారని రాహుల్ అన్నారు. విద్యార్ధుల డిమాండ్ న్యాయమైందని, వారి వాదనను ఆలకించాలని కోరారు. వర్సిటీల్లో పెచ్చుమీరుతున్న హింస, ఆందోళనల నేపథ్యంలో విపక్ష పార్టీలతో సంప్రదింపులు జరిపిన మీదట రాహుల్ మీడియాతో మాట్లాడారు.
ఆర్థిక వ్యవస్ధ ఎందుకు విఫలమైందో ప్రధాని మోదీ యూనివర్సిటీల్లో యువత ఎదుట నిలబడి వివరించే ధైర్యం ప్రదర్శించాలని సవాల్ విసిరారు. ప్రధాని నరేంద్ర మోదీ అంతటి సాహసానికి ఒడిగట్టబోరని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలకు ఆయన ఏం చేయబోతున్నారో ప్రధాని వివరించాలని కోరారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్ధుల్లో పెల్లుబుకుతున్న నిరసనల వెనుక అంతర్లీనంగా నిరుద్యోగం పట్ల వారి ఆగ్రహం వ్యక్తమవుతోందని, ప్రభుత్వం ఈ విషయం గ్రహించకుండా ఆందోళనలను అణిచివేస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment