
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నేతలపై జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టిన హస్తం పార్టీ నేతలను పొగడ్తతల్లో ముంచెత్తారు. ఈ ఆందోళనకు సారథ్యం వహించిన ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ప్రశాంత్ కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విటర్ వేదికగా స్పందించారు. కేంద్రానికి వ్యతిరేకంగా, ప్రజలపక్షాణ నిలిచిన తీరు అభినందనీయమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగాలని ఆయన కోరారు. (గెట్ రెడీ : ప్రశాంత్ కిషోర్)
కాగా బిహార్‌లో సైతం ఎన్‌ఆర్‌సీని అమలు చేయవద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యక్త పరిచారు. దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన, నిరసనలు చోటుచేసుకోవడంతో నితీష్ తలొంచక తప్పలేదు. రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని అమలు చేసే ప్రసక్తే లేదని చివరికి తేల్చి చెప్పారు.