
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరా తీసినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మాజీ ప్రధాని దేవెగౌడ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, కుమారస్వామిలతో భేటీ అవ్వడం, త్వరలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లతో భేటీ అయ్యేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేయడం తెలిసిందే.
కేసీఆర్‌తో ఇప్పటికే సమావేశమైన నేతలు ఫ్రంట్‌పై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారన్న విషయంపై రాహుల్ ఆరా తీసినట్టు సమాచారం. మంగళవారం ఢిల్లీలో రాహుల్‌ను ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు కలిశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ ఫ్రంట్‌పై రాహుల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబం, పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడకుండా చేయడానికి కేసీఆర్ ఫ్రంట్ పేరుతో ముందుకొచ్చారని రాహుల్‌కు వివరించినట్టు వీహెచ్ మీడియాకు తెలిపారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించాలని భార్య, కోడలు నుంచి కేసీఆర్‌కు ఒత్తిడి అధికమైందన్నారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తే అనంతర పరిణామాలు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడకుండా చూసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రాహుల్‌తో చెప్పానన్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ‘జన్ ఆక్రోశ్’ పేరుతో నిర్వహించిన మొదటి ర్యాలీ విజయవంతమైందని, రాహుల్ ఉపన్యాసం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందని వీహెచ్ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు తెలంగాణ కాంగ్రెస్ తన వంతు కృషి చేస్తుందని ఆయన తెలిపారు.