సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీకి మే 12వ తేదీన జరగనున్న ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యక్తిగత ప్రతిష్ఠకు, పార్టీ ప్రతిష్ఠకు ఎంత ముఖ్యమో, మూడవ లేదా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న నాయకులకు కూడా ఆ ఫలితాలు అంతే ముఖ్యం. 2019లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పాలకపక్ష భారతీయ జనతా పార్టీని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెల్సిందే.
జాతీయ స్థాయిలో పాలకపక్ష భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని తొలుత ప్రతిపాదన తీసుకొచ్చినదీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు. ఆయన ప్రతిపాదనకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అనుకూలంగా స్పందించారు. ఇరువురు ముఖ్యమంత్రులు ఈ విషయమై సమగ్ర చర్చలు కూడా జరిపారు. పాలకపక్ష బీజేపీకి ప్రత్యామ్నాయంగా తృతీయ ఫ్రంట్ మమతా బెనర్జీ కోరుకుంటున్నప్పటికీ ఆమెకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫ్రంట్‌కు నాయకత్వం వహించడం ఇష్టం లేదు. అవసరమైతే, అవకాశం వస్తే తానే నాయకత్వం వహించాలన్నది ఆమె మనోవాంఛగా కనిపిస్తోంది. సమీప భవిష్యత్తు అవసరాల కోసం ఫ్రంట్‌కు ఇతరుల నాయకత్వాన్ని అంగీకరించవచ్చుగానీ, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించడానికి సుముఖంగా లేరు. ఒక్కసారి రాహుల్ విజయం సాధించి అధికారంలోకి వస్తే ఆయన్ని ఆ స్థానం నుంచి తప్పించడం కష్టమని, ఇతరులైతే ఏదే విధంగా తప్పించవచ్చన్నది ఆమె మనోగతంగా కనిపిస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పొత్తు ద్వారా ఘన విజయం సాధించిన సమాజ్‌వాది, బహుజన సమాజ్ పార్టీలకు కూడా తృతీయ ఫ్రంట్‌లో కాంగ్రెస్ పార్టీని కలుపుకోవడం అంతగా ఇష్టం లేదు. తృతీయ ఫ్రంట్‌పై మొగ్గు చూపుతున్న శరద్ పవార్‌కు తానే ప్రధాని అభ్యర్థిని కావాలనే కాంక్ష ఎక్కువగా ఉన్నదనే విషయం తెల్సిందే. అయితే ఆయనకు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి. మమతా బెనర్జీ విషయాన్ని పక్కన పెడితే వామపక్షాలతో పొత్తు పెట్టుకునేందుకు రాహుల్ సిద్ధంగా ఉన్నారు. ఆయనకు సీపీఎం పార్టీ నాయకుడు సీతారామ్ ఏచూరితో మంచి సంబంధాలు ఉన్నాయి. తన ప్రతిపాదిత మూడో ఫ్రంట్‌లోకి తీసుకురావడానికి కేసీఆర్ ఇటీవల కర్ణాటకలో జేడీఎస్ నాయకుడు దేవెగౌడతో చర్చలు జరిపారు. ఆ చర్చలు కూడా ఫలించినట్లు కనిపిస్తున్నాయి. రానున్న కర్ణాటక ఎన్నికల్లో ఆయన పార్టీకి 20, 30 సీట్లు వస్తే ప్రభుత్వం ఏర్పాటులో ఆ పార్టీయే కీలకం కానుంది.
ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రాహుల్ గాంధీకి చావో, రేవోలాగా పరిణమించాయని చెప్పవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాలంటే సంపూర్ణ మెజారిటీ సాధించాల్సిందే. అతిపెద్ద పార్టీగా అవతరిస్తే సరిపోదు. ఎందుకంటే ద్వితీయ స్థానంలో వచ్చినా సరే బీజేపీ దేవెగౌడతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్‌ను దెబ్బతీయడం కోసం అవసరమైతే దేవెగౌడకు ముఖ్యమంత్రి పదవిని కూడా ఆఫర్ చేస్తుంది. కర్ణాటకలో విజయం సాధిస్తేనే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌లో రాహుల్ గాంధీకి చోటు లభిస్తుంది. అంతేకాకుండా సీట్ల బేరం కూడా పెరుగుతుంది. సీట్ల విషయంలోనే త్రిపురలో తృణమూల్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. డిసెంబర్‌లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్సీపీతో ఇదే విషయమై పొత్తు కుదరలేదు.
Comments
Please login to add a commentAdd a comment