కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)
కాంగ్రెస్ అధ్యక్షుడు, నెహ్రూ గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు భారత ప్రధాని కావాలన్న ఆకాంక్షను, సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆయన ఈ విషయం మంగళవారం బెంగళూరులో ఇంత సూటిగా, స్పష్టంగా చెప్పడం ఇదే మొదటిసారి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం 44కు పడిపోవడమేగాక ఆ తర్వాత జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయి, ఇప్పుడు 29 రాష్ట్రాలకు గాను కర్ణాటక సహా మూడింటిలోనే అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆయన ఈ మాటలు చెప్పడంతో రాజకీయ పండితులు ఆశ్చర్యంతో కనుబొమలు ఎగరేస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమి పాలై తమ మిత్రపక్షాలన్నింటిలోనూ కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధించి, అతి పెద్ద పార్టీగా అవతరిస్తే అప్పుడు ప్రధాని కావడానికి సిద్ధమేనని ఆయన విశదీకరించారు.
2004లో ప్రధాని పదవి గొప్పేమీ కాదన్న రాహుల్!
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ యూపీఏ పేరిట కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడే రాహుల్ కూడా తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పుడు, ‘మీకు ప్రధాని కావాలన్న కాంక్ష లేదా?’ అని ఓ విలేఖరి ప్రశ్నించగా, ‘‘మా ముత్తాత ప్రధానిగా ఉన్నారు. మా నాయనమ్మ ప్రధాన మంత్రిగా పనిచేశారు. నా తండ్రి ప్రధాని బాధ్యతలు నిర్వర్తించారు. కాబట్టి ప్రధాని పదవి దక్కడం మాకు గొప్ప విషయమేమీ కాదు’’ అంటూ రాహుల్ ఇచ్చిన జవాబులో అహంభావం ధ్వనించింది. తర్వాత మళ్లీ ఆయన దీని గురించి మాట్లాడలేదు. ప్రధాని కావడానికి ముందు ఇందిర మాదిరిగానే కేంద్రంలో మంత్రిగా ఆయన చేరతారని యూపీఏ మొదటి హయాంలో వార్తలొచ్చాయి.
మన్మోహన్‌సింగ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తే రాహుల్‌కు పాలనపై అవగాహనతో పాటు మంచి తర్ఫీదు లభిస్తుందని కాంగ్రెస్ నేతలు భావించారు. కాని, ఆయన మంత్రి కాలేదు. అధికారం అంటే ఆసక్తి, వ్యామోహం లేనట్టు వ్యవహరించేవారు. గాంధీ అనే ఇంటిపేరు వల్లే తనకు మిగిలినవారి కన్నా ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారని కూడా ఆయన ఓ సందర్భంలో అన్నారు. అందుకే ఆయనకు ‘ఇష్టంలేని యువరాజు’ అని మీడియాలో ముద్రపడింది. యూపీఏ రెండో హయాంలో మన్మోహన్ రాజీనామా చేసి రాహుల్‌కు ప్రభుత్వ పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం కూడా నిజం కాలేదు. చివరికి సోనియా అనారోగ్యం కారణంగా 2014 నాటికే ఆయనకు కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కుతుందని ఊహాగానాలు వచ్చినా ఆయన అందుకు సిద్ధపడలేదు.
ప్రధాని పదవి వయసులో ఇందిరతో పోలిక వచ్చే జూన్19న 48 ఏళ్లు నిండుతున్న రాహుల్‌గాంధీ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్టు యువనేతేమీ కాదు. ఆయన తండ్రి రాజీవ్‌గాంధీ 40 ఏళ్లకే ప్రధాని పదవి చేపట్టి 45 ఏళ్ల వయసులో అధికారం కోల్పోయారు. ఇందిర 48 సంవత్సరాల వయసులో 1966లో మొదటిసారి ప్రధాని పదవి చేపట్టారు. ఆయన చెప్పినట్టు వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎన్డీయేతర పార్టీల్లో కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు లభించి ప్రధాని పదవి వరిస్తే రాహుల్‌కూడా ఆయన నాయనమ్మ వయసులో అధికారంలోకి వచ్చినట్టవుతుంది. ఈ పదవి దక్కించుకున్న భారత ‘మొదటి రాజకీయ కుటుంబానికి’ చెందిన నాలుగో నేతగా రాహుల్ చరిత్ర కెక్కుతారు.
ఆరేళ్ల ఎన్డీఏ పాలన తర్వాత 2004 ఎన్నికల్లో కనిపించిన బీజేపీ వ్యతిరేక వాతావరణం వామపక్షాలు, అనేక ప్రాంతీయపార్టీలను కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించేలా చేశాయి. ఇదే పరిస్థితి వచ్చే ఎన్నికల నాటికి పునరావృతమై బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఓటమి పాలైతేనే రాహుల్ కోరిక నెరవేరుతుంది. అనేక ప్రాంతీయ పక్షాల నేతలు ఇలాంటి ‘త్రిశంకు’ పరిస్థితుల్లో ప్రధాని కావాలన్న ఆకాంక్షతో ఉన్నారు. కేంద్ర మంత్రి సహా ఏ ప్రభుత్వ పదవి నిర్వహించిన అనుభవం లేని రాహుల్ నాయత్వాన పనిచేయడానికి మిగిలిన ఎన్డీయేతర పార్టీలు ఎంత వరకు అంగీకరిస్తాయనే విషయం కాలం చెప్పాల్సిన సమాధానం.
- సాక్షి నాలెడ్జ్‌సెంటర్
Comments
Please login to add a commentAdd a comment