
సాక్షి, తిరుపతి/తిరుమల: ‘‘కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం. ప్రత్యేక హోదాను ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు’’ అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు. ప్రత్యేక హోదా భరోసా యాత్ర చిత్తూరు జిల్లా తిరుపతికి చేరుకున్న సందర్భంగా తారకరామ స్టేడియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో హామీలిచ్చారని, ఒక్కటి కూడా అమలు చేయలేదని, అవన్నీ అబద్ధపు హామీలేనని మండిపడ్డారు. మంచిరోజులు తీసుకొస్తానని చెప్పి రాఫెల్ యుద్ధ విమానాల్లో అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్లు దోచిపెట్టారని దుయ్యబట్టారు. ప్రధానమంత్రిని కాదు, కాపలాదారుడినని చెప్పుకుంటూ చివరకు దొంగయ్యాడని మోదీపై నిప్పులు చెరిగారు. ఇచ్చిన మాటపై నిలబడడం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకతన్నారు.
ప్రధాని మోదీ సిగ్గుపడాలి
‘‘40 మంది భారత జవాన్లు ఉగ్రదాడిలో చనిపోయి రక్తపు మడుగులో పడివుంటే.. ప్రధానమంత్రి మోదీ తన సెల్ఫ్ సినిమా షూటింగ్‌లో మూడున్నర గంటలు గడిపారు. ఇలాంటి వ్యక్తులు దేశ భక్తులా? మరణించిన జవాన్ల కుటుంబాల్ని ఓదార్చాలన్న స్పృహ కూడా లేని వ్యక్తి మోదీ. దేశంకోసం ప్రాణం వదిలిన సైనికుల కుటుంబాల వేదన ఆయనకు పట్టలేదు. సైనికుల సంతాప సమయంలోనూ మోదీ చిరునవ్వుతోనే కనిపించారు. ఇది ఆయన సిగ్గుపడాల్సిన విషయం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఆయన సిగ్గుపడాలి. హోదా కోసం ఎవరూ ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. మేము హోదా ఇచ్చితీరుతాం. ఇది మా భరోసా. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, రాకపోయినా కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే ఏపీకి హోదా ఇస్తాం’’ అని రాహుల్‌గాంధీ పునరుద్ఘాటించారు.
భూసేకరణ చట్టాన్ని తుంగలోకి తొక్కారు
‘‘కాంగ్రెస్ పార్టీ చెప్పినవన్నీ అమలు చేసింది. కూలీలు వలసలు వెళ్లకుండా ఉండడానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. రైతులకు మేలు చేసేలా భూసేకరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. రూ.లక్ష విలువ చేసే భూమికి రూ.4 లక్షలు ఇవ్వాలని చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని ప్రస్తుత పాలకులు తుంగలో తొక్కారు. ఒకే రోజులో రూ.75 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే. నరేంద్ర మోదీ సూటుబూటు వేసుకున్నవారి రూ.3.50 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారే తప్ప రైతుల రుణాలను మాఫీ చేయలేదు. నాపై రాష్ట్రం చూపిన ప్రేమాభిమానాలు మర్చిపోలేను. అందుకే మరోసారి భరోసా ఇస్తున్నా. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించి తీరుతాం’’ అని రాహుల్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి ఊమెన్‌చాందీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి కేవీపీ రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రులు పళ్లంరాజు, జేడీ శీలం, పనబాక లక్ష్మి, మాజీ ఎంపీలు కనుమూరి బాపిరాజు, టి.సుబ్బరామిరెడ్డి, చింతామోహన్ తదితరులు పాల్గొన్నారు.
సభకు జనం కరువు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు ప్రత్యేక హోదా భరోసా యాత్రను ప్రతిష్టాత్మకంగా భావించారు. తెరచాటుగా తెలుగుదేశం పార్టీ సహకారం కూడా తీసుకున్నారు. తిరుపతిలో జరిగే కాంగ్రెస్ సభకు జనాన్ని తరలించాలని సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా టీడీపీ నేతలకు ఆదేశాలిచ్చారు. రెండు పార్టీల నేతలు జన సమీకరణకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఒక్కొక్కరికి రూ.200 నుంచి రూ.300 చొప్పున ఇచ్చినా ప్రయోజనం కనిపించలేదు. 30 వేల మందితో సభ నిర్వహించాలని భావించినా.. 5 వేల మంది కూడా హాజరు కాకపోవటం రాహుల్‌ను నిరుత్సాహానికి గురిచేసింది. ఆయన తన ప్రసంగాన్ని కుదించి హడావుడిగా ముగించి ఢిల్లీ వెళ్లిపోవడం గమనార్హం.
శ్రీవారిని దర్శించుకున్న రాహుల్‌గాంధీ
ఇదిలా ఉండగా, రాహుల్‌గాంధీ శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన కాలినడకన తిరుపతిలో 11.50 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఒకటిన్నరకు తిరుమల చేరుకున్నారు. మేనల్లుడు రైహాన్ వాద్రాతో కలిసి నడిచారు. వడివడిగా మెట్లు ఎక్కుతూ గాలిగోపురం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి తిరుమలలోని శ్రీకృష్ణ అతిథిగృహానికి చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకుని 3.13 గంటలకు వైకుంఠం–1 ద్వారా శ్రీవారి ఆలయంలోకి చేరుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపం వద్ద అర్చకులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు రాహుల్‌గాంధీకి శ్రీవారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాలను అందజేశారు.
రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ: రఘువీరారెడ్డి
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని ఎంఎస్‌ఆర్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్సుయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ.. రాహుల్ ప్రధాని అయితే రాష్ట్రానికి హోదా ఇస్తారని చెప్పారు.