
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 20, 27 తేదీల్లో రాహుల్ తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే.. 20వ తేదీ రాహుల్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే టీపీసీసీ ఖరారు చేసింది. ఆరోజు ఆదిలాబాద్ జిల్లా బోథ్, కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే ఎన్నికల సభల్లో రాహుల్ పాల్గొంటారు. ఇందుకోసం టీపీసీసీ పెద్ద భారీగా ఏర్పాట్లు చేస్తోంది. రాహుల్ సభలతో రాష్ట్రంలో పార్టీ ప్రచారానికి ఊపు వచ్చే విధంగా సభలను నిర్వహించాలని యోచిస్తోంది. అటు, 27వ తేదీ రాహుల్ టూర్ ఖరారైనా.. ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో 27న సభలు నిర్వహించాలని టీపీసీసీ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని నేతలు చెబుతున్నారు.
ప్రచారానికి ‘బ్రేక్’
రాహుల్ ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్ల కోసం టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ చేపట్టిన ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. షెడ్యూల్ ప్రకారం శనివారం మహబూబ్‌నగర్ నుంచి నల్లగొండకు రావాల్సిన ప్రచార యాత్ర మహబూబ్‌నగర్‌లోనే నిలిచిపోయింది. రాహుల్ పర్యటన ఏర్పాట్ల కోసం ప్రచార కమిటీ బృందం రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండాల్సి వస్తోందని, అందుకే ప్రచారాన్ని తాత్కాలికంగా నిలిపివేశామని ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. అయితే, రెండ్రోజుల అనంతరం సవరించిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చెనగాని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వహ కార్యదర్శిగా ఓయూకు చెందిన చెనగాని దయాకర్‌ను నియమించారు. ఈ మేరకు శనివారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దయాకర్‌కు నియామక పత్రం అందజేశారు. విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్న దయాకర్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని ఉత్తమ్ కోరారు. కార్యక్రమంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పాల్గొన్నారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శిగా నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన చింత సోమన్నను నియమించారు.