న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేదిశగా రాహుల్ గాంధీ (47) పయనానికి మరో అడుగు ముందుకు పడింది. అధ్యక్ష పదవి నామినేషన్‌కు చివరిరోజైన సోమవారం ఆయన నామినేషన్ వేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తోపాటు పార్టీ సీనియర్‌నాయకులు వెంటరాగా రాహుల్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వద్ద నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు రాహుల్ గాంధీ.. తల్లి సోనియాతోపాటుగా మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీల ఆశీస్సులు అందుకున్నారు. మొత్తం 89 సెట్ల నామినేషన్లు సోమవారం దాఖలయ్యాయయని ఎన్నికల అధికారి ఎం.రామచంద్రన్ తెలిపారు.
రాహుల్ స్వయంగా రెండుసెట్ల పత్రాలను దాఖలుచేశారు. ఇందులో రాహుల్ అభ్యర్థిత్వాన్ని అధ్యక్షురాలు సోనియా ప్రతిపాదించగా సీనియర్ నేతలు మోతీలాల్ వోరా, అహ్మద్ పటేల్ తదితరులు బలపరిచారు. రెండోసెట్‌లో మన్మోహన్ ప్రతిపాదించగా సిద్దరామయ్య, టి.సుబ్బిరామిరెడ్డి, జైపాల్ రెడ్డి తదితరులు బలపరిచారు. సోనియా సహా సీడబ్ల్యూసీ, ఏఐసీసీ నేతలంతా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, సమయం ముగిసేంతవరకు రాహుల్ ఒక్కరే నామినేషన్ వేశారని అందువల్ల ఆయన ఎన్నిక లాంఛనమేనని పార్టీ వర్గాలంటున్నాయి. ఒకవేళ వేరే నామినేషన్ దాఖలై ఉంటే డిసెంబర్ 16న ఎన్నిక జరిపి 19వ తేదీన కౌంటింగ్, ఫలితాలు వెల్లడిస్తారు.
డార్లింగ్ ఆఫ్ కాంగ్రెస్: మన్మోహన్
పార్టీని 19 ఏళ్లుగా (పదేళ్లపాటు అధికారంలో) నడుపుతున్న అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి రాహుల్ పగ్గాలు స్వీకరించనున్నారు. 2013లో పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితుడైనప్పటినుంచీ రాహుల్‌కు పూర్తిస్థాయి బాధ్యతలపై అడపాదడపా చర్చ జరిగినా.. చివరకు దేశంలో రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారటం, 2019 ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో పార్టీ కీలక బాధ్యతలు అందుకోనున్నారు. ‘రాహుల్ గాంధీ డార్లింగ్ ఆఫ్ కాంగ్రెస్ (అత్యంత ప్రీతిపాత్రుడు). పార్టీ సంప్రదాయాన్ని విజయవంతంగా కొనసాగిస్తారు’ అని మన్మోహన్ పేర్కొన్నారు. యువరాజు నాయకత్వంలో.. ఇటీవలి కాలంలో వరుస ఓటములతో కుదేలైన పార్టీకి తిరిగి పునర్‌వైభవం వస్తుందని పలువురు యువ, సీనియర్ నాయకులు ఆశాభావం వ్యక్తంచేశారు. బీజేపీ విమర్శలను తిప్పికొడుతూ.. ప్రజాస్వామ్యంపై నమ్మకంలేక ఓటింగ్ మెషీన్లను నమ్ముకునే వారు తమకు ప్రజాస్వామ్యం గురించి చెప్పటం పెద్దజోక్ అని గులాం నబీ ఆజాద్ ఎద్దేవా చేశారు.
‘పిడీ’కరణ్ పూర్తయింది: బీజేపీ
కాంగ్రెస్‌లో పిడీకరణ్ (వారసుడి ప్రకటన) పూర్తయిందని బీజేపీ విమర్శించింది. ఇటీవల రాహుల్ తన కుక్క ‘పిడీ’యే తన తరపున ట్వీట్లు చేస్తుందని చెప్పిన నేపథ్యంలో.. ఆ కుక్క పేరును ప్రస్తావిస్తూ ‘పిడీకరణ్’ పదాన్ని ప్రయోగించింది. ‘తరచూ విఫలమవుతు న్నా.. ఓ వ్యక్తిని పార్టీ ఉన్నత పదవికి ప్రతిపాదించటం ఎక్కడా జరగదు’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment