తిరువనంతపురం : వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నందుకు తనను విమర్శిస్తున్న సీపీఎం నాయకులను, కార్యకర్తలను తాను ఒక్క మాట కూడా అనబోనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీతో పాటు వయనాడ్‌లో కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం వయనాడ్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేశారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కేరళలో కాంగ్రెస్, సీపీఎం మధ్య వివాదం ఉంది. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. కానీ ఇక్కడ కేరళ ప్రజలకు నేను ఒక్క విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. భారతదేశం అంతా ఒక్కటే అని నేను నమ్ముతున్నాను. దాన్ని నిరూపించేందుకే ఉత్తర, దక్షిణ భారతదేశం రెండు చోట్ల పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నాను. అయితే ఇక్కడ నా పోటీని విమర్శించే లెఫ్ట్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఒక్క మాట కూడా అనబోను’ అని రాహుల్ స్పష్టం చేశారు.
అంతేకాక తాను వయనాడ్ నుంచి పోటీచేయడం సీపీఎం నాయకులకు కోపం తెప్పించిందని.. వాళ్ల కోపాన్ని తాను అర్థం చేసుకోగలనని అన్నారు. వారు తనని ఎన్ని మాటలన్నా తాను మాత్రం వారిని తిరిగి ఒక్కమాట కూడా అనబోనని స్పష్టం చేశారు. రాహుల్ వయనాడ్ నుంచి కూడా పోటీచేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ప్రకటించిన వెంటనే కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు.
రాహుల్ వయనాడ్ నుంచి పోటీ చేయడమంటే అది బీజేపీపై పోటీ చేస్తున్నట్లు కాదని, సీపీఎంకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నట్లేనని అన్నారు. ఆ తర్వాత కూడా కొంత మంది సీపీఎం నాయకులు రాహుల్‌ను ఓడించేందుకు బాగా కష్టపడతామని, అందుకు పార్టీ కార్యకర్తలందరూ సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలో నేడు రాహుల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment