సేవాగ్రామ్/వార్ధా (మహారాష్ట్ర): ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో హింస, ద్వేషాలను వ్యాప్తి చేస్తూ ప్రజలను విడగొడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. మోదీ ప్రభుత్వంపై రెండో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని ఆ పార్టీ మంగళవారం ప్రజలకు పిలుపునిచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ 149వ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధా జిల్లా సేవాగ్రామ్ ఆశ్రమంలోని మహాదేవ్ భవన్‌లో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది.
ద్వేష, హింసా పూరిత సిద్ధాంతాలే మహాత్ముడిని బలిగొన్నాయనీ, ఇప్పుడు అవే సిద్ధాంతాలను బీజేపీ అవలంబిస్తూ పైకి మాత్రం తాము అహింసా మార్గంలో వెళ్తున్నామని బూటకపు మాటలు చెబుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. రైతుల ర్యాలీని కేంద్రం ఢిల్లీ సరిహద్దుల్లో అడ్డుకుని వారిపై పోలీసు బలగాన్ని ప్రయోగించడాన్ని తాము తీవ్రంగా నిరసిస్తున్నామంది. 1942లో సేవాగ్రామ్‌లో తొలి సీడబ్ల్యూసీ సమావేశం మహాత్మా గాంధీ అధ్యక్షతన జరగ్గా క్విట్ ఇండియా ఉద్యమంపై నాడు తీర్మానం చేశారు.
మళ్లీ 1948లో రెండోసారి తర్వాత సీడబ్ల్యూసీ భేటీ సేవాగ్రామ్‌లో జరగడం ఇది మూడోసారి. మహాత్మా గాంధీ బతికున్నప్పుడు ఆయనను దూషించి, తిరస్కరించి, ద్వేషాన్ని వ్యాప్తి చేసి ఆయన మరణానికి కారణమైన ఆరెస్సెస్ ఇప్పుడు తాము మహాత్ముడి అనుచరులమని సిగ్గులేకుండా చెప్పుకుంటోందంటూ చేసిన ఓ తీర్మానాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. ఢిల్లీకి ర్యాలీగా చేరుకుంటున్న రైతులపై పోలీసు బలగాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన మరో తీర్మానాన్ని కూడా సీడబ్ల్యూసీ ఆమోదించింది. ఈ భేటీకి యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితర నేతలు హాజరయ్యారు.
తమ ప్లేట్లు కడిగిన సోనియా, రాహుల్
సేవాగ్రామ్‌లో భోజనం అనంతరం సోనియా గాంధీ, రాహుల్‌లు తాము తిన్న ప్లేట్లను తామే కడిగారని పార్టీ నాయకుడొకరు చెప్పారు. గాంధీజీ నివాసంలో జరిగిన ప్రార్థనలకు రాహుల్ హాజరయ్యారన్నారు. రాహుల్‌తోపాటు సోనియా, మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జయంతి సందర్భంగా జాతిపితకు నివాళులర్పించారు. ఆశ్రమంలో రాహుల్ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1986లో ఓ మొక్క నాటగా ఇప్పుడది పెద్ద చెట్టు అయ్యింది. ఆ చెట్టు పక్కనే రాహుల్ గాంధీ కూడా మంగళవారం మరో మొక్క నాటారు.
వారంతా గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకమే: రాహుల్
మహాత్మాగాంధీ సమాజంలో సామరస్యం, శాంతి కోసం తన ప్రాణాలను త్యాగం చేశారనీ, కేంద్ర ప్రభుత్వంలోని మోదీ, ఇతరులు మాత్రం మహాత్ముడి సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశాన్ని విడదీయడం, అబద్ధపు హామీలివ్వడమే పనిగా కేంద్రం పనిచేస్తోందని దుయ్యబట్టారు. గాంధీజీ 150వ జయంత్యుత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని వార్ధాలో ర్యాలీని రాహుల్ ప్రారంభించారు. ‘గాంధీజీ ఏ సిద్ధాంతాల కోసమైతే తన ప్రాణాలను అర్పించారో అవే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మోదీ ప్రతిరోజు పనిచేస్తున్నారు’ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment