
సాక్షి,న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓటమి ఎదురైనా బీజేపీ తరహాలో కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేయబోదని ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు.రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలను ప్రచారం చేయవచ్చని బీజేపీ నమ్ముతోందని, వారికీ..తమకూ అదే వ్యత్యాసమని చెప్పారు. రాజకీయ ప్రయోజనం తమకు దక్కకపోయినా..ఎన్నికల్లో ఓటమి పలకరించినా తాము సత్యాన్ని వీడబోమని స్పష్టం చేశారు.
బీజేపీ నేతల రాజకీయాలతో దేశ పునాదులకే పెనుముప్పు పొంచి ఉందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం, దేశ ప్రజాస్వామ్య పునాదులపై నేరుగా దాడి జరుగుతున్నదని అన్నారు. బీజేపీ సీనియర్ నేతల ప్రకటనలు ఈ దిశగా ఆందోళన రేకెత్తిస్తున్నాయని, దీన్ని అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ సహా, ప్రతి భారతీయుడి కర్తవ్యమన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 133వ వ్యవస్ధాపక దినోత్సవంలో రాహుల్ పాల్గొన్నారు.