సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియా గాంధీ శనివారం నాడు తప్పుకొని ఆ బాధ్యతలను తన వారసుడైన రాహుల్ గాంధీకి అధికారికంగా అప్పగిస్తున్న విషయం తెల్సిందే. 1998లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఆమె 19 సంవత్సరాల పాటు ఆ బాధ్యతల్లో కొనసాగి రెండు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించారు. పార్టీ అధ్యక్ష పదవిలో ఆమె ప్రస్థానం ఒడుదుడుకులు లేకుండా ఏమీ సాగలేదు. ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. పార్టీని సాఫీగా నడిపించడంలో భాగంగా ఆమె ప్రధానంగా అయిదు పొరపాట్లు చేశారు. వాటిని రాహుల్ గాంధీ చేయకుండా ముందుకు వెళ్లినట్టయితే మున్ముందు ప్రధాని నరేంద్ర మోదీ అంతటివాడికి ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదగగలరు.
1. ప్రధానంగా రాజకీయ సలహాదారులపైనే ఆధారపడడం
పార్టీ అధ్యక్షలుగా సోనియా గాంధీ ఎన్నికైనప్పుడు ఆమెకు రాజకీయానుభవం పెద్దగా లేదు. పైగా విదేశీయురాలిగా రాజకీయ పక్షాల నుంచి తీవ్ర దాడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఆమె రాజకీయ సలహాదారులపైనే ఎక్కువ ఆధారపడ్డారు. పార్టీ నాయకులను క్రమశిక్షణలో ఉంచలేకపోయారు. వారు పార్టీ నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినప్పుడు కూడా వారిపై కఠిన చర్యలు తీసుకోలేకపోయారు. 2009లో పార్టీ రెండోసారి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఈ విషయంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారింది.
పార్టీ ప్రభుత్వాన్ని అనేక అవినీతి కుంభకోణాలు చుట్టుముట్టాయి. పార్టీని సాఫీగా నడిపించడంలో భాగంగా ఆమె ఎవరిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో 2014 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. సోనియా గాంధీ ప్రతి చిన్న విషయానికి సలహాదారులపైనే ఆధారపడడం వల్ల భూపేందర్ సింగ్ హూడా, వీరభద్ర సింగ్, అజిత్ సింగ్, అమరిందర్ సింగ్ లాంటి ప్రాంతీయ అధికార కేంద్రీకత నాయకులుగా ఎదిగారు. రాహుల్ గాంధీ పటిష్ట నాయకుడిగా ఎదగాలంటే సీనియర్, జూనియర్లను కలుపుకుపోవడమే కాకుండా ఆచితూచి సొంత నిర్ణయాలే తీసుకోవాలి.
2. పార్టీ కార్యాలయం నుంచే పనులు జరగాలి
ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉంది. సోనియా గాంధీ తన 19 ఏళ్ల కాలంలో ఈ కార్యాలయాన్ని ఉపయోగించింది బహు అరుదు. ఏడాదికి పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజున జెండాను ఎగురవేయడం కోసం, మధ్యలో ఒకటి, రెండు సార్లు సమావేశాల కోసం ఉపయోగించేవారు. పార్టీ కార్యకలాపాలన్నింటినీ జనపథ్ రోడ్డులోని నివాసం నుంచే నిర్వహించేవారు. అందుకని కొద్ది మంది పార్టీ అగ్ర నాయకులకు తప్పించి మరెవరికి సోనియా గాంధీని కలుసుకునే అవకాశం ఉండేది కాదు.
ఇతర నాయకులు కూడా ఎవరూ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చేవారు కాదు. ఎప్పుడూ తాళం వేసే ఉండేది. దీంతో ఢిల్లీ పార్టీ కార్యకర్తలు ఎంతో నిరుత్సాహానికి గురుయ్యారు. సోనియా గాంధీ తరచుగా పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి ఉంటే కార్యకర్తలతో కూడా ఓ ప్రత్యేక అనుబంధం ఏర్పడేది. ఇప్పుడు కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తున్న రాహుల్ గాంధీ పార్టీ కార్యకలాపాలను తన నివాసం నుంచి కాకుండా పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి నిర్వహించినప్పుడు మాత్రమే ఆయన పార్టీ కార్యకర్తలతో మమేకం కాగలరు. మంచి నాయకుడిగా ఎదగగలరు.
3. పార్లమెంట్‌ను స్వయంగా ఎదుర్కోవాలి
సోనియా గాంధీ పార్లమెంట్‌కు తరచూ వచ్చేవారుగానీ, చర్చల్లో ధీటుగా పాల్గొనేవారు కాదు. ఎక్కువగా కాగితంపై రాసుకొచ్చిన అభిప్రాయాన్నే ఆమె చదివి వినిపించేవారు. అందుకనే ఆమెను పార్లమెంట్‌లో ‘లీడర్ కాదు రీడర్’ అని పిలిచేవారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను ఎదుర్కొనే బాధ్యతను ఆమె మాధవరావు సింధియా, శివరాజ్ పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, మల్లిఖార్జున ఖర్గే లాంటి వారికి అప్పగించారు. నరేంద్ర మోదీకి నిజంగా సవాల్ చేయాలనుకుంటే రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా చర్చలో పాల్గొనాలి. ఆర్థిక అంశాల నుంచి అంతర్జాతీయ సంబం«ధాల వరకు దేనిపైనైనా అనర్గళంగా మాట్లాడాలి. పార్టీ వైఖరిని స్పష్టం చేయాలి.
4. పార్టీ వ్యవస్థను బాగు చేయాలి
సోనియా గాంధీ తన నివాసం నుంచే ప్రధానంగా పార్టీ కార్యకలాపాలను నిర్వహించడం వల్ల దేశవ్యాప్తంగా పార్టీ రాష్ట్ర యూనిట్లు బలహీనమయ్యాయి. ఆమె పార్టీ బలోపేతం కోసం రాష్ట్రా శాఖలను సందర్శించిన సందర్భాలు కూడా తక్కువే. రాహుల్ గాంధీ అలా కాకుండా దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్లి పార్టీ పనితీరును పరిశీలించాలి. అక్కడికక్కడే సముచిత నిర్ణయాలు తీసుకోవాలి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు ఎప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేయాలి. పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపి ప్రజాఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేలా చూడాలి.
5. మీడియాకు దూరంగా ఉండరాదు
సోనియా గాంధీకి మీడియా అంటే ద్వేషం లేకపోయినప్పటికీ ఎప్పుడు కూడా మీడియాకు దగ్గరగా లేరు. ఆమెగానీ, రాహుల్ గాంధీగానీ నేరుగా మీడియాను అడ్రస్ చేసిన సందర్భాలూ తక్కువే. రాహుల్ గాంధీ ఇటీవల రెండు పొడవాటి ఇంటర్వ్యూలు ఇచ్చారుగానీ అది చాలదు. ప్రతి అంశంపై పార్టీ వైఖరిని సుస్పష్టం చేసేందుకు మీడియా ముందుకు రావాలి. అదే భారతీయ జనతా పార్టీ ఎల్‌కే అద్వానీ, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కారి పార్టీ వైఖరులను మీడియా ముందు ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment