
చౌటుప్పల్: టీఆర్‌ఎస్‌లోకి రావాలని తమను పిలిచినా వెళ్లలేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ సమస్యలు చెప్పేందుకు సీఎం అపాయింట్‌మెంట్ కోరితే చిల్లర నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ, 2014, 2019 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తమను టీఆర్‌ఎస్‌లోకి రమ్మని పిలిస్తే నిరాకరించామని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తున్న తాము ఆ పార్టీలోకి ఎందుకు వెళ్తామని ప్రశ్నించారు. కోమటిరెడ్డి సోదరుల నీతి, నిజాయితీ రాష్ట్ర ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు.