
కాంగ్రెస్ నేత సి. రామచంద్రయ్య(పాత చిత్రం)
వైఎస్సార్ జిల్లా : బీజేపీ, టీడీపీలపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య(సీఆర్) మండిపడ్డారు. కడపలో విలేకరులతో మాట్లాడారు. ‘లోక్ సభలో మెజారిటీ ఉందని నిరూపించుకోవాల్సిన బాధ్యత బీజేపీపైన ఉంది. ఒకసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాక కచ్చితంగా చర్చ జరిగి తీరాల్సిందే. ఇప్పడు ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు.
అప్రజాస్వామిక ప్రభుత్వం కేంద్రంలో ఉంది. వీరికి పాలించే హక్కు లేదు. చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉండటం చూసి రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తల దించుకునే పరిస్థితి నెలకొంది’ అని ఘాటుగా స్పందించారు.
‘ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నిసార్లు యూటర్న్ తీసుకున్నాడు. తన స్వలాభం కోసం కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నాడు. అన్ని రాజకీయ పార్టీల నేతలను ఢిల్లీకి తీసుకెళ్తా అని అఖిలపక్షం సమావేశంలో చెప్పి ఒక్కడే ఢిల్లీకి వెళ్లాడు. పార్లమెంట్ సమావేశాలు అయిపోయాక అన్ని పార్టీల ఎంపీలు వెళ్లిపోయాక అఖిలపక్షం ఢిల్లీకి తీసుకుని పోవడం వృధాప్రయాస. ప్రతి దాన్నీ అవకాశ రాజకీయాలు చేస్తున్నాడు. మోదీ పార్లమెంటుకు దండం పెడితే చంద్రబాబు ఫోటోలకు ఫోజూ ఇచ్చి దండం పెడతావా’ అని ఘాటుగా ధ్వజమెత్తారు.
అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజం చేసే రకం చంద్రబాబు అని విమర్శించారు. ఐదు కోట్ల తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన లబ్ది కోసం తెలంగాణ విడదీయాలని లేఖ ఇచ్చి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ విడదీసిందని చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రాష్ట్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కపట నాటకాలు ఆడుతున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు చేతకాని తనం వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడని అన్నారు.