సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో కారు వేగానికి కూటమి కూలిపోయింది. ప్రస్తుతానికి టీఆర్‌ఎస్ 85 స్థానాల్లో గెలుపొందగా.. మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక మహాకూటమిగా ఏర్పడి కేసీఆర్‌ను గద్దె దించేందుకు శతవిధాల ప్రయత్నించగా.. అతికష్టం మీద ఇరవై స్థానాల్లో గెలుపొందింది. ఇక కూటమి పరిస్థితే ఇలా ఉంటే స్వతంత్రులుగా బరిలోకి దిగిన అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి వైరా నుంచి రాములు నాయక్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆయన.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి.. దాదాపు 2వేల మెజార్టీతో విజయం సాధించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి బానోతు మదన్‌లాల్‌పై గెలుపొందారు.
ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పెద్దసంఖ్యలో బరిలోకి దిగారు. పలువురు అభ్యర్థులు బీఎస్పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ వంటి చిన్న పార్టీల నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చిన్న పార్టీల నుంచి పోటీపడిన వారిలో ఇద్దరు గెలుపొందగా.. స్వతంత్రులుగా పోటీచేసిన వారిలో ఒకరు మాత్రమే గెలుపొందారు. ఈసారి మొత్తంగా 1306 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగగా..చాలామందికి చేదు అనుభవమే మిగిలింది. పలు నియోజకవర్గాల్లో చిన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులకు చాలా తక్కువ సంఖ్యలో ఓట్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment