కేసీఆర్‌ డ్రైవరైతే.. ఆ నలుగురే ప్యాసెంజర్లు..! | Randeep Surjewala comments on TRS Govt | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ‘కారు’లో ఆ ఐదుగురే...

Published Sun, Nov 25 2018 1:59 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Randeep Surjewala comments on TRS Govt - Sakshi

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్‌ విడుదల చేస్తున్న రణదీప్‌ సూర్జేవాలా. చిత్రంలో ఆర్‌.సి.కుంతియా, మధుయాష్కి గౌడ్, శ్రవణ్‌కుమార్, గూడూరు నారాయణరెడ్డి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌:  ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఆ ఐదుగురు చేతుల్లో బందీ అయిందని ఏఐసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్‌ సూర్జేవాలా విమర్శించారు. టీఆర్‌ఎస్‌ కారులో సీఎం కేసీఆర్‌ డ్రైవరైతే, కేటీఆర్, కవిత, హరీశ్‌రావు, సంతోష్‌ ప్యాసెంజర్లనీ, కారులో వారికి తప్ప మిగతా ఎవరికీ చోటు లేదని ఎద్దేవా చేశారు. తన నియంతృత్వ పాలనతో కేసీఆర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ విచ్చలవిడి అవినీతికి పాల్పడిందని, రాష్ట్రాన్ని లూటీ చేసిందని ధ్వజమెత్తారు. అవినీతిలో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో ఉందని, కేసీఆర్‌ కింగ్‌ ఆఫ్‌ కరప్షన్‌ అని దుయ్యబట్టారు. శని వారం ఇక్కడ గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్, పీసీసీ ముఖ్య అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

టీఆర్‌ఎస్‌ పాలనావైఫల్యాలపై 24 అంశాలతో కూడిన చార్జిషీట్‌ విడుదల చేశారు. కమీషన్ల కోసం సాగునీటి ప్రాజెక్టుల అంచనాలను ఇష్టారీతిన పెంచారని, మియాపూర్‌లో 796 ఎకరాల ప్రభుత్వభూమిని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని, ఎలాంటి టెండర్లు లేకుండా రూ.300 కోట్లతో పోలీసు వాహనాలు కొనుగోలు చేశారని సూర్జేవాలా ఆరోపించారు. 50 ఎకరాల రిజర్వ్‌ అటవీ భూములను టీఆర్‌ఎస్‌ పార్టీ సెక్రెటరీ జనరల్‌ కె.కేశవరావుకు అప్పనంగా కట్టబెట్టారని, మిషన్‌ భగీరథ పైపుల కొనుగోలులోనూ అవినీతి జరిగిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్‌ అవినీతిపై పీపుల్స్‌ కమిషన్‌ వేసి, దోషులుగా ఎవరు తేలినా, వారు ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే, అధికారి, ఎవరైనా కటకటాల వెనక్కి పంపిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీలు బీజేపీ ముసుగులేనని, వారికి బీజేపీతో రహస్య మిత్రత్వం ఉందని ఆరోపించారు.  

కాంగ్రెస్‌ చార్జిషీట్‌లోని ముఖ్యాంశాలివీ.. 
- ఉద్యమంలో 1,200 మందికిపైగా బలిదానం చేసుకుంటే, కేవలం 400 మందికే సాయం చేశారు. 
టీఆర్‌ఎస్‌ పాలనలో 4,511 మంది ఆత్మహత్య చేసుకున్నా, ఒక్కరినీ కేసీఆర్‌ పరామర్శించలేదు. రుణమాఫీకి ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము వడ్డీలకే సరిపోయింది. 
కోటి ఎకరాలకు నీళ్లిస్తామని ఒక్క ఎకరాకు కూడా అదనంగా ఇవ్వలేదు. ప్రాణహిత ప్రాజెక్టును రీడిజైన్‌ చేయడంతో జాతీయహోదా కోల్పోవాల్సి వచ్చింది.  
​​​​​​​- వందరోజుల్లో నిజాం షుగర్స్‌ పునరుద్ధరిస్తామన్న మాటను నిలబెట్టుకోలేదు. 
​​​​​​​- ఇంటికో ఉద్యోగమని చెప్పి తన కుటుంబంలోని ఐదుగురికి పదవులు ఇప్పించుకున్నారు. 
​​​​​​​- లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కేవలం 22,588 ఉద్యోగ నియామకాలు చేపట్టారు.  
​​​​​​​- దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీనిచ్చి కేవలం 4,939 కుటుంబాలకే భూపంపిణీ చేశారు. 
​​​​​​​- మైనార్టీ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లని చెప్పి వాటి కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించలేదు. 
​​​​​​​- కేసీఆర్‌ కేబినెట్‌లో మహిళలకు ప్రాతినిధ్యంలేదు. 
​​​​​​​- మిగులు రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలనలో రూ.1.80 లక్షల కోట్ల అప్పుల పాలుచేసింది. 
​​​​​​​- ఆరోగ్య శాఖలో అంబులెన్స్‌ల కొనుగోలు, ఇసుక వేలంలో అవినీతి జరిగింది. వాటర్‌గ్రిడ్, పోలీసు వాహనాల కొనుగోలు, మిషన్‌ కాకతీయ, ఆర్‌ అండ్‌ బీ టెండర్లలో అక్రమాలు జరిగాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement