
సాక్షి, ఛండీగఢ్ : శిరోమణి అకాలీదళ్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుఛా సింగ్ లంఘాపై అత్యాచార ఆరోపణలలో కేసు నమోదయ్యింది. గుర్‌దాస్‌పూర్‌లో ఓ మహిళపై ఆయన అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆయనపై కేసు నమోదు చేశారు.
శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్‌కు అత్యంత సన్నిహితుడు అయిన సుఛాపై రేప్ ఆరోపణలు రావటం సంచలనం సృష్టిస్తోంది. నేడు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాదల్ హయాంలో రెండు దఫాలు సుచా మంత్రిగా పని చేశారు. 2012 ఎన్నికల్లో డేరా బాబా నానక్ నియోజకవర్గ స్థానం నుంచి పోటీ చేసి సుఛా ఓడిపోయారు. గతంలో అక్రమాస్తుల కేసులో కూడా ఆయనపై ఆరోపణలు రాగా సుప్రీంకోర్టు మాత్రం ఊరటనిచ్చింది.
ఇదిలా ఉంటే నటుడు వినోద్ ఖన్నా మరణంతో ఖాళీ అయిన గురుదాస్‌పూర్ నియోజక వర్గానికి ఎన్నికల సంఘం అక్టోబర్ 11న ఉప ఎన్నిక నిర్వహించబోతుంది . ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి స్వరణ్ సలారియాపై పలు క్రిమినల్ ఉండగా, వాటిని ఆధారంగా చేసుకుని కాంగ్రెస్, ఆప్ పార్టీలు విమర్శనాస్త్రలు ఎక్కుపెడుతున్నాయి. తాజాగా సుఛా వ్యవహారం వెలుగు చూడటంతో అకాళీదల్-బీజేపీ కూటమి ఇరకాటంలో పడినట్లయ్యింది.