
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ మానసిక సంతులత సరిగ్గా లేదు, సీఎం తన స్థాయికి తగట్టు మాట్లాడటం లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా విమర్శించారు. రాజకీయంగా దిగజారి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, రోజురోజుకూ పెరుగుతున్న ప్రజావ్యతిరేకతతో ఓటమి భయంపట్టుకుని వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు.
ఆదివారం హైదరాబాద్‌లోని ముషీరాబాద్ చౌరస్తాలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ పాద యాత్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు సోనియా గాంధీ ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడంతోనే ఆధికారం చేజారిందని పేర్కొన్నారు. కేసీఆర్ తన వల్లే తెలంగాణ సాధ్యమైందని ప్రజలకు మాయమాటలు చెప్పడంతో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ందని ఎద్దేవా చేశారు. మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అన్నింటా వైఫల్యం చెందారని దుయ్యబట్టారు.
మోదీ గ్రాఫ్ తగ్గుతోంది
దేశంలో మోదీ గ్రాఫ్ తగ్గుతోందని.. రాహుల్ గ్రాఫ్ పెరుగుతోందని కుంతియా అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగితే నష్టం వాటిల్లుతుందనే కేసీఆర్ ముందస్తుకు సిద్ధమయ్యాడని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎంఐఎంతో దోస్తీ తెంచుకుని పార్లమెంట్ ఎన్నికల్లో మోదీతో జతకట్టడం ఖాయమని జోస్యం చెప్పారు.
కేసీఆర్ పిట్టల దొర: షబ్బీర్
కేసీఆర్ అబద్ధాలకోరు, నంబర్ వన్ పిట్టల దొర అని శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ దుయ్యబట్టారు. కేసీఆర్ మాటలే చెబుతాడు తప్ప..చేతలుండవన్నారు. మోదీ సర్కార్ ప్రజలను దోపిడీ చేసిందని, నోట్ల రద్దు, జీఎస్‌టీ పేరిట దోపిడీకి పాల్పడి రిలయన్స్‌కు అప్పనంగా అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ తీరును ఎండగట్టారు.