తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఆర్‌సీ కుంతియా(పాత చిత్రం)
ఢిల్లీ: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాలని అనుకుంటుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఆర్‌సీ కుంతియా ప్రశ్నించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఐదేళ్లు పాలించమని అధికారం ఇచ్చారు..కానీ ముందస్తు ఎన్నికలు పోతామని సంకేతాలు ఇవ్వడం దేనికి నిదర్శమన్నారు. వాళ్ల అవినీతి ఏమైనా బయట పడుతుందేమోనని కేసీఆర్ భయపడుతున్నారా అనే అనుమానం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామని, తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని జోస్యం చెప్పారు.
2018 ఏప్రిల్ వరకు ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత టీఆర్‌ఎస్‌పై ఉందని, కేసీఆర్‌కి తెలంగాణ ప్రజల ఆదరణ తగ్గుతుందనే భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. నవంబర్‌లో ఎన్నికలు జరిగితే సెప్టెంబర్ నుంచి తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుందని, ప్రభుత్వ నిధులు కూడా వృథా అవుతాయని తెలిపారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ పూర్తిగా నెరవేర్చారా..ప్రజలకు సమాధానం చెప్పాలని సూటిగా అడిగారు.
Comments
Please login to add a commentAdd a comment