
సాక్షి, హైదరాబాద్ : టీడీపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డితో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియ శనివారం భేటీ అయ్యారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభ, పార్టీలో రేవంత్ స్థానంతో పాటు, ఆయన పదవిపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు గిరిజన రైతు గర్జన పేరిట ఈ నెల 20వ తేదీన కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లుపై కూడా కుంతియా చర్చించినట్లు తెలుస్తోంది.
కాగా టీడీపీలో ఉంటే ఎప్పటికీ సీఎం పీఠం దక్కదని భావించి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారన్న ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా రేవంతే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆయన నియోజకవర్గం కొడంగల్‌లో కార్యకర్తలు ప్లకార్డులు కూడా పట్టారు. రేవంత్‌కు ఉన్న జనాదరణ కాంగ్రెస్‌లో ఎవరికీ లేదన్న వాదన బయలుదేరింది. ఈ నేపథ్యంలో రేవంత్‌తో కుంతియా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.