
సాక్షి, నాగర్‌కర్నూలు: కొంగరకలాన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించేది ప్రగతి నివేదన సభ కాదని.. అది కేసీఆర్ ఆవేదన సభ అని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. కల్వకుర్తిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికల గురించి కేసీఆర్ నరేంద్ర మోదీ వద్ద మోకరిల్లారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని గద్దెనెక్కిన తర్వాత.. పార్లమెంట్ ఎన్నికలతో మోదీతో కలుస్తానని కేసీఆర్ ఒప్పుకుని వచ్చారని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మేనిఫెస్టోపైన చర్చించేందుకు సిద్ధమైతే తనతో బహిరంగ చర్చకు రావాలని కేసీఆర్‌కు సవాలు విసిరారు.
నెత్తిమీద జట్టు ఊడిపోతే దుబాయి వెళ్లి నెత్తి మీద వెంట్రుకలు నాటించకున్న సన్నాసి నాతో మాట్లాడతాడా అంటూ మంత్రి కేటీఆర్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్ దింపుడు కళ్ళం ఆశలతో కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నారని ఆయన వ్యాఖ్యనించారు. అలాగే ఉల్పర సభలో మాట్లాడిన రేవంత్‌రెడ్డి ఉల్పర రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన రైతులకు న్యాయంగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.