
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డితోపాటు మరో 25 మంది దాకా ఆ పార్టీ సీనియర్ నేతలు కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని తెలుగుదేశంలోని ఒక వర్గం నుంచి వెలువడిన ప్రకటనతో ఆ పార్టీలోని టీఆర్‌ఎస్ వ్యతిరేక వర్గీయులు కంగుతిన్నారు. తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలో ఉంటే భవిష్యత్ ఉండదని భావిస్తున్న ఈ నేతలంతా కాంగ్రెస్‌లో చేరాలన్న నిర్ణయానికి వచ్చారు.
ఈ నేపథ్యంలోనే రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. తనతోపాటు టీటీడీపీకి చెందిన 25 మంది కాంగ్రెస్‌లో చేరతారని ఈ సందర్భంగా రాహుల్‌కు రేవంత్ వివరించినట్టు తెలిసింది. వారి జాబితాను కూడా అందించి, వచ్చే శాసన సభ ఎన్నికల్లో ఆ 25 మంది పోటీ చేస్తే విజయావకాశాలు అధికంగా ఉంటాయని, వారికి సీట్లు ఇచ్చేలా హామీ ఇవ్వాలని కోరారు. ఈ షరతుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమా చారం.
అంతేగాకుండా వచ్చే ఎన్నికలలో రేవంత్‌రెడ్డిని ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమిం చేందుకూ రాహుల్ సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రముఖ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు రేవంత్ చేరిక విషయం ముందే తెలిసినట్టు సమాచారం. తాజా సమాచారం ప్రకారం రేవంత్ వచ్చేనెల 9న కాంగ్రెస్‌లో చేరతారు. ఆ తర్వాత కొద్దిరోజులకే హైదరా బాద్ లేదా మహబూబ్‌నగర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాహుల్‌ను ఆహ్వానించాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్‌లోకి ఎవరెవరు..?
తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీడీపీకి ప్రత్యేకంగా రాష్ట్ర శాఖను ఏర్పాటు చేసి ఎల్.రమణను అధ్యక్షుడిగా నియమించారు. తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, టీడీఎల్పీ నేతగా వ్యవహరించిన ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారడంతో ఆ రెండు పదవులూ రేవంత్‌ను వరించాయి. అయితే పార్టీలో గ్రూపు రాజకీయం ఇటీవల బాగా ముదిరిందని, రేవంత్‌ను సమర్థిం చేవారు, ఆయనకు వివిధ సందర్భాల్లో, పార్టీ అంతర్గత సమావేశాల్లో మద్దతుగా నిలిచిన వారంతా టీడీపీని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. వీరిలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఉండడం గమనార్హం. పూర్వపు పది జిల్లాల వారీగా పరిశీలిస్తే.. వరంగల్ జిల్లా నుంచి సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరెడ్డి సిద్ధంగా ఉన్నారు.
రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేరు కూడా వినిపించినా.. ఆయనకు నియోజకవర్గం ఖాళీగా లేకపోవడం, నర్సంపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే (ఇండిపెండెంట్‌గా గెలిచి, అసోసియేట్ సభ్యుడిగా ఉన్నారు) దొంతి మాధవరెడ్డి ఉండటంతో రేవూరి టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లాలో పెద్దిరెడ్డి, విజయ రమణారావు, నిజామాబాద్‌లో అన్న పూర్ణమ్మ, నల్లగొండలో ఉమా మాధవరెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి(టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరారు) తదితరుల పేర్లు బలంగా ప్రచారంలోకి వచ్చాయి. మరోవైపు బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆ పార్టీలో కొనసాగడంపై పునరాలోచనలో పడ్డారని, ఆయన కూడా కాంగ్రెస్‌కు హస్తం అందిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ నేతలతో ముఖాముఖి..
తన సొంత జిల్లా (పూర్వపు మహబూబ్‌నగర్)కు చెందిన సీనియర్ నాయకురాలు డీకే అరుణను రేవంత్ గురువారం వెళ్లి కలిశారు. తాను కాంగ్రెస్‌లో చేరడం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇలా ఒక్కో కాంగ్రెస్ నాయకుడిని కలిసి తన చేరికపై సమాచారం ఇస్తున్నారని అంటున్నారు. పార్టీలో చేరితే కొడంగల్ నియోజకవర్గ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలా? రాజీనామా చేస్తే ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉందా? పార్టీ మారి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే విమర్శల దాడి జరుగుతుందా? అన్న అంశాలపై తన సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం.