
శనివారం రాత్రి కొడంగల్ చేరుకున్న రేవంత్, ఇంటి వద్ద అభిమానుల కోలాహలం, కాంగ్రెస్ పోస్టర్లు
సాక్షి, కొడంగల్ : తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామాను ప్రకటించిన తర్వాత తొలిసారి కొడంగల్‌కు వచ్చిన రేవంత్‌రెడ్డికి అభిమానులు సాదరస్వాగతం పలికారు. టీడీపీ చీఫ్ చంద్రబాబుతో సమావేశం కోసం విజయవాడ వెళ్లిన రేవంత్.. ముఖాముఖి భేటీ లేకుండానే శనివారం రాత్రి కొడంగల్‌కు వచ్చేశారు. రేవంత్ ఇంటివద్ద వందల సంఖ్యలో గుమ్మికూడిన అభిమానులు.. ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.
ఆదివారం ఉదయం ప్రెస్‌మీట్ : తనకోసం ఎదురుచూసిన కార్యకర్తలు, మీడియాను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు రాత్రైపోయింది. చీకట్లో అందరూ జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లండి. రేపు(ఆదివారం) పొద్దున 9గంటలకు అన్ని విషయాలు మాట్లాడుతాను. తప్పకుండా అందరూ రండి’’ అని చెప్పారు.
సీఎంను చేస్తాం : రేవంత్ ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆయన అభిమానులు కొందరు మీడియాతో మాట్లాడారు. ‘‘రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారన్నది మాకు ముఖ్యం కాదు. కొడంగల్ అభివృద్ధే మాకు ప్రధానం. ఇప్పటికీ ప్రజలంతా నాయకుడి వెంటే ఉన్నారు. వెనుకబడ్డ కొడంగల్ పేరును ఢిల్లీ దాకా తీసుకెళ్లిన రేవంత్‌ను ఏ పార్టీ సింబల్ నుంచైనా గెలిపిస్తాం. మా ప్రాణాలిచ్చైనా ఆయనను ముఖ్యమంత్రిని చేస్తాం’’ అని అభిమానులు చెప్పుకొచ్చారు.