సాక్షి, కోస్గి(వికారాబాద్): టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకున్నట్టుగా కనబడుతోంది. ఓటుకు కోట్లు కేసులో ఏ-1గా ఉన్న రేవంత్ రెడ్డి, ఏ-2 సెబాస్టీయన్ ఇళ్లతోపాటు, రేవంత్ సన్నిహితుల ఇళ్లలో గురువారం ఉదయం నుంచి ఐటీ అధికారు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ సోదాలు నిర్వహిస్తున్నా.. రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో అధికారులు ఆయనకు ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్‌కు రావాలని చెప్పారు. కుటుంబ సభ్యులతో సహా హైదరాబాద్‌కు రావాలని ఆదేశించారు. దీంతో కోస్గిలో కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో ఉన్న రేవంత్ అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.
హైదరాబాద్‌కు బయలుదేరే ముందు రేవంత్ తన అనుచరులతో మాట్లాడుతూ.. ‘ఓటుకు కోట్లు కేసులో ఇప్పటికే 32 రోజులు జైల్లో పెట్టారు. మీరు అండగా ఉన్నారనే ధైర్యంతోనే హైదరాబాద్‌కు వెళ్తున్నాను. నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇదే నా అఖరి ప్రసంగం కావొచ్చ’ని తన సన్నిహితుల వద్ద ఆందోళనను వ్యక్తపరిచారు. ఒకవేళ అరెస్ట్ చేస్తే జైలు నుంచే నామినేషన్ దాఖలు చేస్తానని రేవంత్ తెలిపారు. తనను ఏమీ చేయలేకే.. ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ‘జైల్లో తిన్న చిప్పకుడు మీద ఒట్టేసి చెబుతున్న.. కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించేవరకు నిద్రపోన’ని శపథం చేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత కొడంగల్ ప్రజలదేనని అన్నారు.
గతంలో రాజకీయాల్లో కలకలం రేపిన ఓటుకు కోట్లు కేసులో అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి ముద్దాయిగా ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు 50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ-1గా ఉన్న రేవంత్‌కు 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై ఐటీ శాఖకు తెలంగాణ ఏసీబీ ఈ నెల 13వ తేదీన లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment