సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో విజయం సాధించడం పట్ల భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి దాని మాతృసంస్థ ఆరెస్సెస్ అక్షింతలు వేసింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉపయోగించిన భాష, ప్రవర్తనను ఎండగట్టింది. ఆరెస్సెస్ అభివృద్ధికి ఆర్థికంగా అండగా ఉండడమే కాకుండా క్యాడర్‌ను అందిస్తున్న పాటిదార్లు, చిరు, చిల్లర వ్యాపారులను దూరం చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మేరకు ఎన్నికల ఫలితాలు విడుదలైన మరునాడే అంటే, 19వ తేదీన ఆరెస్సెస్ సంయుక్త ప్రధాన కార్యదర్శులు దత్తాత్రేయ హోసబేల్, కృష్ణ గోపాల్‌లు ఓ లేఖను సీనియర్ బీజేపీ నాయకుడు రామ్‌లాల్ ద్వారా పంపించారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పేరిట వచ్చిన ఆ లేఖను కొంత మంది ముఖ్యనాయకుల సమక్షంలో చదివి, చర్చించినట్లు తెల్సింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలియజేస్తూనే పార్టీకి దూరమైన వ్యాపారవేత్తలు, చిల్లర వ్యాపారులు, రైతులకు లబ్ధి చేకూర్చే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో వారు హిందూత్వం కోసం పనిచేయరని ఆరెస్సెస్ హెచ్చరించింది.
రిజర్వేషన్ల కోసం పాటిదార్లు చేసిన ఆందోళనను కూడా పరిష్కరించడంలో బీజేపీని ఆరెస్సెస్ అప్పట్లో విమర్శించింది. అలాగే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలు ప్రతికూల ఫలితాలను ఇచ్చాయని ఆరోపించింది. జీఎస్టీలో సానుకూల మార్పులు తీసుకురావడం ద్వారా పాటిదార్లను దరి చేర్చుకోవాలని కూడా సూచించింది. 2012 ఎన్నికల్లో బీజేపీకి 115 సీట్లు రాగా, ఈ ఎన్నికల్లో కేవలం 99 సీట్లు మాత్రమే రావడానికి పాటిదార్లు పార్టీకి దూరమవడమే కారణమని ఆరెస్సెస్ భావిస్తోంది.
దళితులు, జాలర్లు, చిన్నకారు రైతులకు సంఘ్‌పరివార్ అందజేసిన సామాజిక సేవను ఓట్లుగా మలుచుకోవడంలో బీజేపీ విఫలమైందని కూడా ఆ లేఖలో ఆరోపణలు వినిపించాయని 19వ తేదీ నాడు లేఖను విన్నబీజేపీ నాయకుడు ఒకరు తెలిపారు. ముఖ్యంగా తమ సిద్ధాంతానికి పరువు ప్రతిష్టలతో పాటు గౌరవనీయమైన భాషను మాట్లాడటం, గౌరవప్రదంగా నడుచుకోవడం బలమని, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడి పార్టీ గౌరవాన్ని దెబ్బతీశారని ఆరెస్సెస్ పెద్దలు ఆరోపించారట!
Comments
Please login to add a commentAdd a comment