మండలి చైర్మన్‌కు ఆ విచక్షణాధికారం లేదు | Rule 71 : Buggana Rajendranath Reddy Fires on Chandrababu, TDP | Sakshi
Sakshi News home page

మండలి చైర్మన్‌కు ఆ విచక్షణాధికారం లేదు

Published Thu, Jan 23 2020 4:17 PM | Last Updated on Thu, Jan 23 2020 4:28 PM

Rule 71 : Buggana Rajendranath Reddy Fires on Chandrababu, TDP - Sakshi

సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి నివేదించే విషయంలో శాసనమండలి చైర్మన్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం మండలిలో జరిగిన ఈ వ్యవహారంపై బుగ్గన గురువారం అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. శాసనసభ ఆమోదించి పంపిన బిల్లుల విషయంలో శాసనమండలికి పరిమితమైన ఆప్షన్స్‌ మాత్రమే ఉంటాయని, ఆ బిల్లును చర్చించి ఆమోదించడం, లేదా సవరణలతో మళ్లీ శాసనసభకు పంపించడం వంటి ఆప్షన్స్‌ ఉంటాయని, కానీ టీడీపీ కుట్రపూరితంగా రూల్‌ 71 అంశాన్ని తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. నిజానికి రూల్‌ 71 నిబంధన కేవలం ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలోనే ఉందని, ఏపీ అసెంబ్లీలో కూడా అది లేదని స్పష్టం చేశారు.

ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రభుత్వ పాలజీని చర్చించి మండలి తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు కొన్ని సంవత్సరాల కిందట ఈ నిబంధనను మండలిలో చేర్చారని వివరించారు. నిజానికి శాసనప్రక్రియలో గవర్నమెంట్‌ బిజినెస్‌కు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని, ఈ మేరకు స్పష్టంగా నిబంధనలు ఉన్నా.. వాటిని ఉల్లంఘిస్తూ చైర్మన్‌ రూల్‌ 71కింద సెలెక్ట్‌ కమిటీకి రిఫర్‌ చేశారని తెలిపారు.  అలా రిఫర్‌ చేసే సమయంలో ఈ రెండు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని తాము లేఖలు ఇచ్చినట్టు టీడీపీ చెప్పుకొచ్చిందని తెలిపారు. నిజానికి రూల్‌ 71 కింద బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి రిఫర్‌ చేసే అధికారమే లేదని బుగ్గన తెలిపారు. సెలెక్ట్‌ కమిటీకి పంపే ప్రొవిజన్‌ లేకపోయినా,  విచక్షణాధికారం కింద బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించినట్టు చైర్మన్‌ చెప్పారని, కానీ, ఇది చైర్మన్‌ విచక్షణాధికారం కిందకు రాదని, దీనికి సంబంధించి స్పష్టంగా నిబంధనలు ఉన్నాయని స్పష్టం చేశారు. మండలిలో టీడీపీ సభ్యుల ప్రవర్తన నవ్వులాటలాగా ఉందని, మండలిలో బలముంది కదా అని అన్ని చట్టాలను, నిబంధనలను, సంప్రదాయాలను టీడీపీ తనకు అనుకూలంగా ఇష్టానుసారంగా వాడుకుంటోందని దుయ్యబట్టారు. తీర్మానాలు, బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో ఆ సమయాన్ని మార్చడానికి చైర్మన్‌కు విచక్షణాధికారం ఉంటుందని, సెలెక్ట్‌ కమిటీకి రిఫర్‌ చేయడంలో కాదని తెలిపారు. ప్రజల తరఫున ఎన్నికైన ప్రభుత్వం ప్రధాన బాధ్యత చట్టాలు రూపొందించడమని, శాసన వ్యవస్థ ప్రథమ బాధ్యత కూడా ఈ చట్టాలను ఆమోదించడమని, ఈ విషయంలో దిగువసభ అసెంబ్లీకే విశేష అధికారాలు ఉంటాయని భారత రాజ్యాంగం కూడా స్పష్టం చేస్తుందని, కానీ ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఏదో రూల్‌ తీసుకొచ్చి.. పరిపాలనను అడ్డుకునేందుకు, చట్టాల రూపకల్పన ప్రక్రియకు మోకాలడ్డేందుకు ప్రయత్నిస్తోందని బుగ్గన తప్పుబట్టారు.

నిన్న సాయంత్రం మండలిలో జరిగింది చాలా బాధాకరమని, నాలుగు గంటలసేపు గ్యాలరీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కూర్చొన్నారని, అసలు ఎప్పుడూ మండలికి రాని చంద్రబాబు వచ్చి.. అంతసేపు కూర్చోవాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. చైర్మన్‌ ఎదుట కూర్చొని.. చైర్మన్‌ను ప్రభావితం చేసేవిధంగా చంద్రబాబు వ్యవహరించారని, ఈ విషయంలో తప్పు చేసినవారిదే కాకుండా తప్పు చేయించేలా ప్రభావితం చేసిన వారిది ఇంకా పెద్ద తప్పు అని మండిపడ్డారు. టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు మంత్రులు సభకు తాగొచ్చారంటూ బాధ్యతారహితంగా, దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. ఇతర పార్టీల సభ్యులు సోము వీర్రాజు, మాధవ్‌తోపాటు పీడీఎఫ్‌, కాంగ్రెస్‌, స్వతంత్ర సభ్యుడు కూడా చైర్మన్‌ చేసింది తప్పని నిర్ద్వంద్వంగా చెప్పారని గుర్తు చేశారు. మండలి చైర్మన్‌ హోదాలో ఉన్న వ్యక్తిఇ తటస్థంగా వ్యవహరించాలని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement