
సాక్షి, అమరావతి : పదినిమిషాల విరామం తర్వాత ఏపీ శాసన మండలి తిరిగి ప్రారంభమైంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను పరిణగలోకి తీసుకుంటున్నట్లు మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. బిల్లుతో పాటు రూల్ 71పై కూడా చర్చిందామని సూచించారు. ఇప్పటికే చాలా సమయం వృధా అయిందని అసహనం వ్యక్తం చేశారు. రూల్ 71పై చర్చిద్దామంటే సభ ఆర్డర్‌లో ఉండట్లేదని అందుకే బిల్లులను పరిగణలోకి తీసుకుంటున్నాని చైర్మన్ వెల్లడించారు. దీంతో అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులు మండలి ముందుకు వచ్చాయి. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు.
కాగా ఈ రెండు బిల్లులకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం విదితమే. మూడు రాజధానులు ఏర్పాటు అంశంపై శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సుధీర్ఘ చర్చల అనంతరం ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ.. సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా బిల్లు ఆమోదం పొందింది. అనంతరం సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లును సైతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది.
చదవండి :