మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నవారే ఏడాది తరువాత స్వాగతిస్తారన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధానిని జగన్ తన ఊరికి తీసుకుపోవట్లేదని, దీనిపై చంద్రబాబు, పచ్చమీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వాణిజ్య విభాగం జిల్లాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి మూడు రాజధానుల వల్ల ఉపయోగాన్ని, వికేంద్రీకరణ వల్ల ఒనగూడే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని కోరారు.
రాష్ట్ర విభజన కన్నా చంద్రబాబు ఐదేళ్ల పాలనలోనే రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందన్నారు. విడిపోయే నాటికి రూ.90 వేల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రం చంద్రబాబు గద్దె దిగేనాటికి రూ.3 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయి దివాళా తీసిందన్నారు. రాజధానిని ఇక్కడ కట్టలేనన్న విషయం చంద్రబాబుకు తెలుసునని, అందుకే ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా ఆ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని సజ్జల విమర్శించారు. విశాఖ ఇప్పటికే బాగా అభివృద్ధి చెందిందని, అక్కడ లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరమే లేదని, అయినా రాజధాని మొత్తాన్ని అమరావతి నుంచి తరలించట్లేదని, కేవలం ఒక భాగాన్ని విశాఖకు, మరో విభాగాన్ని రాయలసీమకు తీసుకు వెళుతున్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్య వైశ్య సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, పార్టీ నేతలు ఆతుకూరి ఆంజనేయులు, 13 జిల్లాల వాణిజ్య విభాగం నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment