సాక్షి, తాడేపల్లి : స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రజలను నమ‍్ముకున్న పార్టీ అని ఆయన అన్నారు. సోమవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిత‍్యం ప్రజల్లో తిరుగుతున్న వ్యక్తి. స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలలో జరగకపోతే నిధులు రావు. టీడీపీకి చెందిన వ్యక్తి రిజర్వేషన్లపై కోర్టులో కేసు వేశారు.
మాకు కూడా ఎన్నికలకు ఎక్కువ సమయం కావాల్సి ఉంది. చేసిన మంచి పనులు ప్రజలకు చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. స్థానిక సంస్థల ప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండాలని, మద్యం నియంత్రణ, డబ్బు పంపిణీ లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చట్టాలు తెచ్చారు. ప్రతిపక్షాలను బెదిరించడానికే సంస్కరణలు తెచ్చారని చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. అప్పట్లో సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్ మీద చంద్రబాబు ఒత్తిడి తెచ్చి జనరల్ ఎలక్షన్స్‌కు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టించారు. అప్పుడు ఇంకా మా పార్టీ పూర్తిస్థాయిలో నిర్మాణం కాలేదు. అయినా ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొన్నాం. బలమైన పార్టీగా చెప్పుకునే చంద్రబాబు... ఎన్నికల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తొమ్మిది నెలల పాలన బాగోలేదని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. అటువంటి అప్పుడు చంద్రబాబు ఎందుకు ఎన్నికలకు భయపడుతున్నారు?.
ఓటర్లలో చైతన్యం తీసుకు రావడం అందరి బాధ్యత. మేం చేసిన పనులనే గడప గడపకు ప్రచారం చేస్తున్నాం. చంద్రబాబు చేసేవన్నీ దుర్మార్గపు ఆలోచనలు. పైపెచ్చు మేం భయపెడుతున్నామని ఆయన దుష్ప్రచారం చేస్తున్నారు. వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ఈ ఎన్నికలను ఆదర్శంగా తీసుకుంటాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. మేం పెట్టిన పథకాలన్నీ ప్రజా సంక్షేమ పథకాలే. ఓటమిపై చంద్రబాబు ముందుగానే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు.
వ్యవస్థలో మార్పు కోసం ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారు. మేం డబ్బుతో ఓట్లు అడగం. చేసిన అభివృద్ధి మీద ఓట్లు అడుగుతాం. వైఎస్ జగన్‌కు చంద్రబాబులా డ్రామాలు తెలియవు. ఆయనకు తెలిసింది ముక్కుసూటిగా మాట్లాడటం మాత్రమే. బీసీలకు పది శాతం రిజర్వేషన్లు అడ్డుకున్నది టీడీపీనే. టీడీపీ అడ్డుకున్న పది శాతం రిజర్వేషన్లు పార్టీ ద్వారా బీసీలకు న్యాయం చేస్తానని సీఎం జగన్ చెప్పారు. ఎన్నికలను అడ్డుకుని కేంద్రం నుంచి నిధులు రాకుండా చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. మా పార్టీ మహిళలకు 50 శాతం మించి సీట్లు ఇస్తున్నాం.
మొన్న జనసేనతో పొత్తు పెట్టుకున్న సీపీఐ ఇప్పుడు టీడీపీతో పొత్తు అంటోంది. 9 నెలల్లో ఏమి తేడా వచ్చింది.. చంద్రబాబులో ఏమి మార్పు కనిపించింది?. జగన్‌మోహన్‌రెడ్డి చేసిన తప్పేమిటని ప్రశ్నిస్తే వాళ్ల దగ్గర నుంచి సమాధానం లేదు. కార్మికులకు జీతాలు పెంచడం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు పెట్టడం వాళ్లకు తప్పుగా కనిపిస్తుందా? టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు కలిసి ముందుకు వెళ్తున్నాయి. ఎవరికి బలం ఉన్నచోట వారు పోటీ చేయాలని భావిస్తున్నారు. వారితో ఇప్పుడు సీపీఐ కూడా కలుస్తోంది. ఇప్పటికైనా టీడీపీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. నాలుగేళ్ల తర్వా త వచ్చే ఎన్నికల గురించి ఆలోచించడం తర్వాత. ముందు స్థానిక సంస్థల ఎన్నికలపై నారా లోకేష్ దృష్టి పెడితే మంచిది’ అని హితవు పలికారు.
చదవండి : సీఎం జగన్‌కు ధన్యవాదాలు : పరిమల్
Comments
Please login to add a commentAdd a comment