టీడీపీ నేతల ‘నేర కథా చిత్రమ్‌’ | Sakshi Special Story On TDP Leaders Criminal History | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల ‘నేర కథా చిత్రమ్‌’

Published Mon, Apr 8 2019 7:08 AM | Last Updated on Mon, Apr 8 2019 7:10 AM

Sakshi Special Story On TDP Leaders Criminal History

అక్రమ సంపాదన కోసం మోసాలు...
ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా...
మాట వినకుంటే దౌర్జన్యం...
అడ్డొస్తున్నారనుకుంటే దాడి...
అయినా ఎదురుతిరిగితే హత్య...

...ఎవరిని అడిగినా ఇవన్నీ చట్ట విరుద్ధ కార్యకలాపాలని కరాఖండిగా చెబుతారు. ఇలాంటివాటికి పాల్పడే నాయకులు ఒక పార్టీలో పదుల సంఖ్యలో ఉంటే ఆ పార్టీని ఏమనాలి? బహుశా టీడీపీ అంటే సరిపోతుందేమో? అధికారం అండగా అంతగా అక్రమాలకు తెగించారు పచ్చ నేతలు. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబే తీవ్ర స్థాయి నేరాల్లో భాగస్వామి. అందుకేనేమో కింది స్థాయి వారు కూడా ఆయన చూపిన బాటలో నడుస్తూ ‘మేమేం తక్కువ తన్నలేదు... తినలేదు’ అంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల  ‘ఘన నేర చరిత్ర’ను ఓసారి పరిశీలిస్తే నివ్వెరపోక తప్పదు.  

వంగి వంగి దండాలు పెడుతూ, నీతులు చెబుతూ ఎన్నికల్లో ఓట్లడుగుతున్న టీడీపీ నాయకుల్లో నేర చరితులుగా ముద్ర వేసుకున్నవారు లెక్కకు మిక్కిలి ఉన్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు దగ్గరనుంచి మొదలయ్యే ఈ చిట్టా... చెబితే ఓ అంతులేని కథే. అయినా, తాము శుద్ధపూసలం అన్నట్లు బాబు జనాన్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. పైగా తమ పార్టీ అభ్యర్థి ఒకరిపై ఏకంగా 26 కేసులున్న సంగతి మరిచి... కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న టెలీ కాన్ఫరెన్స్‌లలో వైఎస్సార్‌సీపీ నేత లపై కేసులు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేయమని తమ కార్యకర్తలకు నూరిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల టీడీపీ అభ్యర్థులు నామినేషన్లతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లను పరిశీలిస్తే ఎవరి చరిత్రేంటో అందరికీ తెలిసిపోతోంది. ఏకంగా 52 మంది టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు, ఐదుగురు ఎంపీ అభ్యర్థులు నేరారోపణలు ఎదుర్కొంటున్న విషయాన్ని ఈ అఫిడవిట్లు చాటుతున్నాయి. ఇందులో 21 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదవగా, మిగిలినవారిపై మోసాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, కబ్జాలు తదితర నేరాలున్నాయి. కొందరిపై ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లోనూ కేసులుండటం... హద్దులు లేని టీడీపీ ఘన నేర చరిత్రకు అద్దంపడుతోంది.

దొంగల బండి ‘స్టే’షన్‌ మాస్టర్‌ బాబు
తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఓటు కొనుగోలుకు రూ.కోట్లు ఇస్తూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసులో బాబు పాత్రపై దర్యాప్తు సాగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోట్లాది మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ సేవామిత్ర యాప్‌ కోసం ఐటీ గ్రిడ్స్‌ అనే సంస్థకు మళ్లించిన వ్యవహారంపైనా కేసులు నమోదయ్యాయి. అయితే, ఇందులో బాబు, ఆయన కుమారుడు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ పాత్ర  తేలాల్సి ఉంది. దేశంలో ఏ రాజకీయ నాయకుడూ చేయని విధంగా ఏకంగా 17 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబు తనపై ఒకే ఒక కేసు ఉన్నట్టు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో అఫిడవిట్‌ దాఖలు చేయడం గమనార్హం. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వాటిని దాచి పెట్టి... బాబ్లీ ప్రాజెక్టు విషయమై ఆందోళనలో నమోదైనట్లు పేర్కొన్న కేసునే ఆయన అఫిడవిట్‌లో చూపారు. తాను ప్రజా సమస్యలపై పోరాడితేనే కేసు పెట్టారని చెప్పుకొనే కుయుక్తి ఇందులో దాగుంది. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ ఠాణాలో ఈ కేసు (67/2010) ఐపీసీ 353, 324, 332, 336, 337, 323, 504, 506, 309, రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద నమోదైంది. ప్రస్తుతం ధర్మాబాద్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో నడుస్తోంది.

అందరూ ఆ తాను ముక్కలే!
టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం నేరగాళ్ల చిట్టాలో ఉన్నారు. మంత్రి పి.నారాయణ తెలుగు అకాడమీ పుస్తకాల అక్రమ ప్రచురణలో సూత్రధారి. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారు. ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, భూ కబ్జాల కేసులతో పాటు బెదిరింపులకు పాల్పడిన ఫిర్యాదులున్నాయి. సినీ నటుడు, సీఎం వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన ఇంట్లోనే నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కాల్పులు జరిపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి గన్నవరం, విశాఖ విమానాశ్రయాల్లో సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనాథాశ్రమ నిర్వాహకులపై బెదిరింపులకు దిగారు. 

‘కోడె’ల.. కేసుల బుస
1988లో నిరాహార దీక్షలో ఉన్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా హత్య మొదలు, 1999 ఎన్నికల సందర్భంగా తనకు చెందిన ఇంట్లో బాంబు పేలుడు సహా గుంటూరు జిల్లా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్‌ రాజకీయ ప్రస్థానం తీవ్ర వివాదాలు, నేరారోపణలమయం. ఆఖరుకు రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీ స్పీకర్‌ పోస్టులో దాదాపు ఐదేళ్ల పాటు కొనసాగిన ఆయన... ఈ పదవీ కాలంలోనూ తన తీరుతో వార్తల్లో నిలిచారు.  తాజాగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తనపై ప్రస్తుతం నాలుగు కేసులు ఉన్నట్టు కోడెల ప్రస్తావించారు. నరసరావుపేట వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో క్రైమ్‌ నంబర్లు 202/2012, 203/2012, 30/2014తో మూడు కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్‌ నాంపల్లి స్పెషల్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో ప్రైవేటు కంప్లయింట్‌ కింద కేసు (సీసీ నంబరు 41/2018) నమోదైంది. ఇక 2014–19 మధ్య స్పీకర్‌ పదవిలో ఉన్న ఆయన టీడీపీ నాయకుడిగానే వ్యవహరించారు. 

బినామీ రమేశ్‌
కేవలం స్వల్ప కాలంలోనే రూ.వేల కోట్లకు పడగెత్తిన చంద్రబాబు మరో బినామీ సీఎం రమేష్‌పై ఒకవైపు విచారణ సాగుతోంది. కొన్ని నెలల క్రితం ఈయన సంస్థలపై ఐటీ దాడుల సందర్భంగా నానా యాగీ చేశారు. ఇప్పుడు సైతం తమ పార్టీ నేతలపై ఐటీ దాడులను అక్రమంగా అడ్డుకుంటున్నారు.

బొండా గిరి
అసెంబ్లీలోనే ‘ఏంట్రా... ఏంట్రరేయ్‌... రారా చూసుకుందాం’ అంటూ ఊగిపోయిన విజయవాడ సెంట్రల్‌ టీడీపీ అభ్యర్థి బొండా ఉమాపై రెండు కేసులున్నాయి. ఎక్సైజ్‌ డ్యూటీ చెల్లింపులో సెంట్రల్‌ ఎక్సైజ్‌ యాక్ట్‌ సెక్షన్‌ 9, 9ఏఏ ప్రకారం హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎకనమిక్‌ అఫెన్సెస్‌ కోర్టులో కేసు నం.17/2010 వీటిలో ఒకటి. కనకదుర్గ గుడి వద్ద ధర్నా నిర్వహించినందుకు కృష్ణలంక ఠాణాలో మరో కేసు (462/2006) నమోదైంది.

ఉమాపై ఒక్కటేనట
మైలవరం అభ్యర్థి దేవినేని ఉమా తనపై ఒకటే కేసు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బాబ్లీ దగ్గర ధర్నాతో ధర్మాబాద్‌ స్టేషన్‌లో (ఎఫ్‌ఐఆర్‌ నం. ఓఎమ్‌సీఏ 27–2013 జేఎఫ్‌ఎమ్‌సీ లో 353, 324, 332, 336, 337, 323, 504, 506, 309 రెడ్‌ విత్‌ 34 ఐపీసీ సెక్షన్లు) కేసు నమోదైందని చూపారు.
ప.గో.లో పలువురిపై...:  గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావుపై హత్యా యత్నం కేసుంది. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుపై ద్వారకా తిరుమల ఠాణాలో చీటింగ్‌ కేసు నమోదైంది. తాడేపల్లిగూడెం అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే ఈలి నానిపై పెంటపాడు పోలీసు స్టేషన్‌లో 188 ఐపీసీ కింద కేసుంది.

అచ్చోసిన చింతమనేని
తీవ్రమైన నోటి దురుసు, దుందుడుకుతనం, ప్రభుత్వ అధికారులపై దాడులు, అక్రమాలతో గత ఐదేళ్లలో తన పేరు చెబితేనే భయపడేలా వ్యవహ రించారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక (26) కేసుల్లో నిందితుడిగా, మొత్తం టీడీపీకే సింబాలిక్‌ రౌడీ ఎమ్మెల్యే అన్నట్లుంటుంది ఆయన తీరు. చింతమనేనిపై ఇప్పటికీ ఏలూరు త్రీ టౌన్‌ ఠాణాలో రౌడీషీట్‌ ఉంది. 2011లో మంత్రిగా ఉన్న వట్టి వసంత్‌కుమార్‌పై ప్రభుత్వ కార్యక్రమంలోనే దాడి చేసిన కేసులో రెండేళ్ల జైలు, రూ.2,500 జరిమానా విధిస్తూ భీమడోలు జూనియర్‌ సివిల్‌ కోర్టు రెండు నెలల కిత్రమే తీర్పిచ్చింది. దీనిపై హైకోర్టు నుంచి తుది తీర్పు రావాల్సి ఉంది. ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి, ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అటవీశాఖ అధికారిపై దాడి, ఐసీడీఎస్‌ అధికారులకు బెదిరింపులు, ఏలూరు టూటౌన్‌ ఠాణాపై దాడికి దిగినంత పని చేసి నిందితులను తీసుకెళ్లడం, అంగన్‌వాడీ కార్యకర్తలను దుర్భాషలాడటం, కానిస్టేబుల్‌ మధును చితక్కొట్టడం, అటవీ శాఖ అధికారిని బలవంతంగా సెలవుపై పంపడం, కొల్లేరు వివాదాస్పద భూముల్లో చేపల వేటలో అప్పటి జిల్లా ఎస్పీపై నోరు పారేసు కోవడం, గతేడాది మేలో గుండుగొలను కూడలిలో ట్రాఫిక్‌ విధుల్లో ఉన్న కొవ్వూరు ఏఎస్‌ఐ, సీపీవోలపై దాడి చింతమనేని తీరును అందరికీ తెలిపింది.

‘సుజనా’త్మక ఎగమేత
చంద్రబాబు పెద్ద బినామీగా పేరున్న సుజనా చౌదరికి చెందిన కంపెనీలు బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టిన ఉదంతంపై దర్యాప్తు సాగుతోంది. సుజనావి దాదాపు రూ.6 వేల కోట్ల ఆర్థిక లావాదేవీ అవకతవకలు. బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులో కొద్ది రోజుల క్రితం ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) చర్యలు తీసుకుంది.

గంటను తట్టుకునేదెవరు?
విశాఖపట్నంలో జరిగిన రూ.లక్ష కోట్ల భారీ భూ స్కామ్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావుదే కీలకపాత్ర. గంటా శ్రీనివాసరావు (విశాఖ ఉత్తరం)పై అనకాపల్లి, కశింకోట పోలీస్‌ స్టేషన్‌లో క్రైమ్‌ నం.15/2009, 3/2018, 4/2018 కింద కేసులున్నాయి. విజయవాడలో పీఆర్‌సీ 1/18 విజయవాడ స్పెషల్‌ కోర్టులో ట్రయల్‌లో ఉంది. ఈయనపై ఐపీసీ 147, 148, 332, 333, 307, 447, 188 రెడ్‌విత్‌ 149 కింద సెక్షన్లపై కేసులున్నాయి. 

పత్తి కుంభకోణంలో పాపం మూటగట్టుకున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అగ్రిగోల్డ్‌ భూములను మింగిన అనకొండల్లో ఒకరనేది అందరికీతెలిసిందే.
మంత్రులు కాల్వ∙శ్రీనివాసులుపై రాయదుర్గంలో 3 కేసులు నమోదవగా, కె.అచ్చె న్నాయుడు, నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపైనా కేసులున్నాయి. టీడీపీ ఎంపీ అభ్యర్థులు నిమ్మల కిష్టప్ప (హిందూపురం), వేటుకూరి వెంకట శివరామరాజు (నర్సాపురం), మాగంటి బాబు (ఏలూరు)పై కేసులుండటం గమనార్హం.

నేరాల చిట్టాలో మరెందరో టీడీపీ అభ్యర్థులు

  • రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ నుంచి కబ్జాల వరకు టీడీపీ నేతల పేరు లేని కుంభకోణం లేదు. 
  • నందమూరి బాలకృష్ణ (అనంతపురం జిల్లా హిందూపురం)పై బుక్కరాయ సముద్రం స్టేషన్‌లో క్రైమ్‌ నం.10/09, గుత్తి పోలీసు స్టేషన్‌లో క్రైమ్‌ నం. 20/09 ఉన్నాయి. విజయవాడ స్పెషల్‌ కోర్టులో సీసీ 40/18, సీసీ 43/18 కేసులు ఉన్నాయి. విజయవాడ కోర్టులో అండర్‌ సెక్షన్‌ 188, 283 ఆఫ్‌ ఐపీ, అండర్‌ సెక్షన్‌ 188, 283 ఐపీసీ కేసులు ఉన్నాయి.
  • కాల్వ శ్రీనివాసులు (రాయదుర్గం)పై అనంతపురం వన్‌టౌన్‌ ఠాణాలో క్రైమ్‌ నం.193/2013, బుక్కరాయసముద్రం ఠాణాలో క్రైమ్‌ నం.10/2009, గుత్తి ఠాణాలో క్రైమ్‌ నం.20/2009 కేసులున్నాయి. 
  • జి.సూర్యనారాయణ (ధర్మవరం)పై క్రైమ్‌ నం.48/2014 కేసును ధర్మవరం జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు నుంచి ఇటీవలే విజయవాడలోని స్పెషల్‌ కోర్టుకు బదిలీ చేశారు.
  • ఉమామహేశ్వర నాయుడు(కళ్యాణదుర్గం)పై బెలుగుప్ప స్టేషన్‌లో క్రైమ్‌ నం.62/2019 కేసు, కళ్యాణదుర్గం ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసులో పీవోఆర్‌ నెం:21/2016–17 కేసు ఉంది. 
  • పరిటాల శ్రీరామ్‌ (రాప్తాడు)పై రామగిరి స్టేషన్‌లో క్రైమ్‌ నంబర్‌ 57/2018 (సెక్షన్లు 363, 324, 384, 342, 307, 506, ఆర్‌/డబ్ల్యూ 34 ఐపీసీ) కిడ్నాప్, హత్యాయత్నం నేరాలపై కేసులున్నాయి.
  • పయ్యావుల కేశవ్‌ (ఉరవకొండ)పై బుక్కరాయసముద్రం స్టేషన్‌లో క్రైమ్‌ నెంబర్‌ 10/2009 కేసుంది. ప్రస్తుతం ఇది అనంతపురం ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు నుంచి విజయవాడ స్పెషల్‌ కోర్టుకు బదిలీ అయింది. 
  • జితేంద్రగౌడ్‌ (గుంతకల్లు)పై వన్‌టౌన్‌ స్టేషన్‌లో క్రైమ్‌ నంబర్‌  99/2005 కేసుంది.
  • కందికుంట వెంకటప్రసాద్‌ (కదిరి)పై హైదరాబాద్‌  సీబీఐ కోర్టులో క్రైమ్‌ నంబర్‌ 2/2003, క్రైమ్‌ నెంబర్‌ 33/2007 కేసులు నడుస్తున్నాయి. 
  • బీకే పార్థసారధి (పెనుకొండ)పై అనంతపురం వన్‌టౌన్‌ ఠాణాలో క్రైమ్‌ నంబర్‌ 193/2013 కేసు సెక్షన్‌ 147, 148, 336, 427, 506, రెడ్‌విత్‌ 149 ఐపీసీ పెండింగ్‌లో ఉంది. అనంతపురం ప్రిన్సిపల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ వద్ద సీసీ నం.88/ 2018 పెండింగ్‌లో ఉంది. 
  • కె.ఈరన్న (మడకశిర)పై స్థానిక ఠాణాలో క్రైమ్‌ నం. 76/2013, మడకశిర జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టులో సీసీ నం.91/2013 ఉన్న కేసు విజయవాడ స్పెషల్‌ కోర్టుకు బదిలీ అయింది.
  • హత్యాయత్నం, దౌర్జన్యం, ఆర్థిక నేరాలతో పాటు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన సహా వాసుపల్లి గణేష్‌కుమార్‌ (విశాఖ దక్షిణ)పై 9 కేసులున్నాయి. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై హైకోర్టులో కేసు నడుస్తోంది.
  • పీలా గోవింద సత్యనారాయణ (అనకాపల్లి)పై ఎఫ్‌ఐఆర్‌ 19/2017 ఐపీసీ సెక్షన్లు 447, 427, 506, రెడ్‌విత్‌ 34 కింద కేసు నమోదైంది. 
  • కేఏ నాయుడు (గజపతినగరం)పై రెండు క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సీసీ 30/2018, సీసీ 31/2018 నంబర్లతో ఉన్న ఈ కేసులు విజయవాడలోని ఎంపీ, ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రత్యేక కోర్టులో ట్రయల్‌లో ఉన్నాయి. 
  • కరణం బలరామకృష్ణమూర్తి (ప్రకా«శం జిల్లా చీరాల)పై మద్దిపాడు స్టేషన్‌లో క్రైం నంబరు 129/06, 131/06 కింద నమోదైన కేసులు విజయవాడ కోర్టులో 11/18, 10/18 విచారణ జరుగుతున్నాయి.
  • దామచర్ల జనార్దన్‌ (ఒంగోలు)పై చెక్కుల పంపిణీ, ఓటర్లను ప్రలోభపెట్టడం, పోలింగ్‌ సమయంలో ఠాణా వద్ద వంద మీటర్లు నిబంధన ఉల్లంఘనకు గాను ఒంగోలు వన్‌టౌన్, హైదరాబాద్‌ జగద్గిరిగుట్ట ఠాణా పరిధిలో వేర్వేరు కేసులు నమోదయ్యాయి. 
  • గొట్టిపాటి రవికుమార్‌ (అద్దంకి)పై మేదరమెట్ల స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నం.88/2015, విజయవాడ ఠాణాలో యూ/ఎస్‌ 143. 341, 188 రెండ్‌ విత్‌ ఐపీసీ సెక్షన్ల కింద, గుంటూరు ఠాణాలో 2015 అక్టోబరు 12న మరో కేసు నమోదైంది. 
  • ముత్తుముల అశోక్‌రెడ్డి (గిద్దలూరు)పై స్థానిక ఠాణాలో క్రైం నంబర్‌ 152/2014 కేసు నమోదైంది. పోలీసు జీపును తగులబెట్టారని ఈ కేసు పెట్టడం గమనార్హం.
  • తనపై 35 కేసులు ఉన్నాయని 2014 అఫిడవిట్‌లో పేర్కొన్న శంకర్‌ యాదవ్‌ (చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి ఎమ్మెల్యే) ఈ ఎన్నికల్లో ఒక్క కేసు కూడా లేదని చెప్పడం గమనార్హం.
  • తోట త్రిమూర్తులు (తూ.గో. జిల్లా రామచంద్రపురం)పై దళితుల శిరోముండనం కేసు రెండు దశాబ్దాలుగా నడుస్తోంది.
  • పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి (నెల్లూరు జిల్లా కోవూరు)పై తెలంగాణ రాష్ట్రంలో మూడు కేసులున్నాయి. 
  • బొల్లినేని రామారావు (నెల్లూరు జిల్లా ఉదయగిరి)పై మహా రాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో మూడు కేసులున్నాయి. 
  • పి.తిక్కారెడ్డి(కర్నూలు జిల్లా మంత్రాలయం)పై హైదరాబాద్‌  14వ స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు, చీఫ్‌ మెట్రో పాలిటన్‌ కోర్టుల్లో రెండు చెక్‌ బౌన్స్‌ కేసులున్నాయి. 
  • బీవీ జయనాగేశ్వరరెడ్డి (ఎమ్మిగనూరు) శ్రీకాళ హస్తి ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో 2017లో కేసు నమోదైంది. కోర్టుకు హాజరు కాకపోవడంతో పోలీసులు మరో కేసు పెట్టారు. ఒకే చెక్కు ఇద్దరికి ఇచ్చిన ఆరోపణపై ఎమ్మిగనూరు కోర్టులోనూ కేసుంది.
  •  గాలి భానుప్రకాశ్‌ (చిత్తూరు జిల్లా నగరి)పై బెంగళూరు సివిల్‌ కోర్టులో 2014 మార్చి 24న క్రైం నెంబర్‌ 124/2014 సెక్షన్‌ 3, 4 పీఎంఎల్‌ఏ యాక్ట్‌ 2002 కింద కేసు నమోదైంది. 
  • మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి (కడప జిల్లా జమ్మలమడుగు)పై జంట హత్యల కేసుతో పాటు మరో కేసు పెండింగ్‌లో ఉంది. 
  • సతీష్‌కుమార్‌రెడ్డి (పులివెందుల)పై ఒక కేసుంది. 
  • గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌పై విజయవాడలో రెండు కేసులున్నాయి. 

ఇలా కేసు కట్టనివి ఎన్నో...
విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై దాడి చేసి ఆయన గన్‌మెన్‌పై దౌర్జన్యం చేసినా కేసు నమోదు కాలేదు. రాజధాని ప్రాంతంలోనే ఇలా చేస్తే... ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఇంకెన్ని కేసులు కాకుండా పోయాయో...? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement