సాక్షి, దెందులూరు: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులో అభద్రతాభావం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. చంద్రబాబు జిల్లాలోని మూడురోజుల పర్యటనలో మాట్లాడిన ప్రతిచోటా హావభావాలు ఈవిషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. గురువారం దెందులూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయ ఆవరణలో చంద్రబాబు మూడురోజుల జిల్లా పర్యటన, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు వత్తాసు పలకటంపై ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి విలేకరులతో మాట్లాడారు. చింతమనేనిని వెనకేసుకురావటానికే చంద్రబాబు సమయం మొత్తం కేటాయించారన్నారు. పార్టీ ఓటమికి కారణాలు, పరిస్థితులపై చర్చించకుండా చింతమనేనిని అమాయకుడిగా చిత్రీకరించేందుకు చంద్రబాబు నానా తంటాలు పడిన విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా నిశితంగా పరిశీలించారన్నారు. దళితులను కించపరిచేలా చింతమనేని వ్యాఖ్యానించటం నిజం కాదా అని ఎమ్మెల్యే కొఠారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విధానం, వేగాన్ని చూసి చంద్రబాబు బెంబేలెత్తుతున్నారన్నారు.
ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా టీడీపీని వీడటం, కోర్టుల్లో సైతం స్టేలు ఎత్తివేయటంతో చంద్ర బాబులో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, ఇసుకను మాఫియాకు అప్పగించారని ఆరోపించారు. ఇదంతా మరిచి స్వచ్ఛ పాలన అందిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తాజాగా ఉంగుటూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను టీడీపీ మాజీ ఎమ్మెల్యే సోదరుడు అతి కిరాతకంగా హత్య చేయించారని ఆరోపించారు. వాస్తవాలు ఇలా ఉంటే జిల్లాలో ప్రశాంతత గురించి చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. జిల్లాలో రౌడీయిజాన్ని పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీనేనన్నారు. అయోధ్య తీర్పు కారణంగా దేశవ్యాప్తంగా 30 యాక్టు అమలులో ఉంటే జిల్లాలోనే ఈ యాక్టు ఉన్నట్టు చంద్రబాబు మాట్లాడటం విచారకరమని ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment