సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. చేవెళ్ల, మల్కాజ్‌గిరీ పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలపడంపై మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం చేవెళ్ల, మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గాల రివ్యూను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్వే.. పార్టీకి చెందిన బోసురాజుపై చిందులేశారు. బోసురాజు తక్కువలో తక్కువ వెయ్యి కోట్లకు ఉంటారని, ఆయన పైసల రాజకీయాలు నడవవని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చేవెళ్ల పార్లమెంటు స్థానానికి కార్తీక్ రెడ్డి బదులు సబితా ఇంద్రారెడ్డిని నిలబెట్టాలని సర్వే సూచించారు. అయితే, సబితాను అసెంబ్లీకే నిలబెట్టాలని ఆమె అనుచరులు పట్టుబట్టారు.
వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్‌కే టికెట్ ఇవ్వాలని సర్వే పేర్కొన్నారు. టీడీపీ, టీఆర్‌ఎస్‌లు తిరిగి వచ్చిన చంద్రశేఖర్ వికారాబాద్ టికెట్‌ను ఆశిస్తున్నారని కానీ, గెలిచే సత్తా ప్రసాద్‌కే ఉందని అన్నారు. కాగా, సర్వే వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఫైర్ అయ్యారు. పార్టీలో గ్రూపులు పెడితే అధికారంలోకి రాలేమని అన్నారు. కేవలం గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2019లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే కొంతమంది నాయకులు రాష్ట్రం విడిచిపెట్టిపోయే పరిస్థితి దీన పరిస్థితి వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment