
సాక్షి, చెన్నై: టీటీవీ దినకరన్ కొత్తగా స్థాపించిన ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’పై శశికళ చిరాకు పడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్బావ సభలో దినకరన్ తనను తాను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా శశికళను ప్రస్తావించడం, అడయారులోని దినకరన్ ఇంటినే పార్టీ చిరునామాగా చూపడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ పెట్టే ఆలోచన లేదని ఈ ఏడాది జనవరి 17వ తేదీన నీలగిరిలో ప్రకటించిన దినకరన్ అకస్మాత్తుగా పార్టీని ప్రకటించడం వెనుక అంతరార్థం ఏమిటని చిన్నమ్మ సన్నిహితుల వద్ద ప్రశ్నించినట్టు సమాచారం. పార్టీ పెట్టడంతో ఎంజీఆర్ సినిమాల్లో విలన్‌లా అన్నాడీఎంకేను, పార్టీ చిహ్నాన్ని ఎడపాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గానికి దినకరన్ అప్పగించినట్లయిందని శశికళ కోపగించుకున్నట్టు తెలుస్తోంది.
దినకరన్ పార్టీ పెట్టడం శశికళ కుటుంబంలోని పలువురు సభ్యులకు కూడా ఇష్టం లేదన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు దినకరన్ పార్టీలో అప్పుడే అసంతృప్తి చెలరేగింది. ద్రవిడ సిద్ధాంతాలను, అన్నాదురైకి తగిన స్థానం కల్పించలేదని ఆరోపిస్తూ సీనియర్ నేత నాంజిల్ సంపత్ శనివారం పార్టీ నుంచి తప్పుకున్నారు.