
సాక్షి, చెన్నై: అక్రమాస్తుల కేసులో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో నాలుగేళ్ల శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె విడుదల విషయంగా కొంత కాలంగా రక రకాల ప్రచారాలు సాగుతున్నాయి. ముందుగానే ఆమె విడుదల అవుతారన్న చర్చ జోరుగానే సాగినా, అందుకు తగ్గ దాఖలాలు కనిపించలేదు. అలాగే, శిక్షా కాలం ముగిసినా, జైలులో లగ్జరీ వ్యవహారం ఆమె మెడకు చుట్టుకోవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఇవన్నీ ఊహాజనితాలే అని పేర్కొనే రీతిలో శిక్షా కాలం ముగియగానే చిన్నమ్మ జయలలిత జైలు నుంచి బయటకు రావడం ఖాయం అవుతోంది. ఇందుకు తగ్గ వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చింది. (చదవండి : రూ.300 కోట్ల శశికళ ఆస్తుల జప్తు?)
విడుదల ఖాయమేనా?
బెంగళూరుకు చెందిన నరసింహమూర్తి చిన్నమ్మ శశికళ విడుదల సమాచారాన్ని సేకరించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఆయన చేసుకున్న విజ్ఞప్తికి బెంగళూరు జైళ్ల శాఖ వర్గాలు వివరాల్ని సమర్పించాయి. శశికళ జైలుకు వచ్చిన వివరాలు, ఆమె శిక్ష కాలం ముగింపు గురించి పేర్కొంటూ, జరిమాన రూ. పది కోట్లు చెల్లించిన పక్షంలో జనవరి 27న విడుదల అవుతారని ప్రకటించారు. ఒక వేళ జరిమానా చెల్లించని పక్షంలో 2022 ఫిబ్రవరి 27న విడుదల అవుతారని సూచించారు. ఈ సమాచారంతో చిన్నమ్మ సేనల్లో ఆనందం తాండవిస్తోంది.
చిన్నమ్మ విడుదల కావడం ఖాయమని, ఇక, తమకు మంచి రోజులు వచ్చినట్టే అని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, చిన్నమ్మ న్యాయవాది రాజాచెందూర్ పాండియన్ పేర్కొంటూ, శిక్షా కాలం ముగిసినానంతరం జనవరి 27న ఆమె విడుదల అవుతారని ఇది వరకే తాను పేర్కొన్నట్టు గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం ఆమె ముందే విడుదలకు అవకాశం ఉందన్నారు. గతంలో జైలులో ఉన్న రోజుల లెక్కింపు, సత్ ప్రవర్తన విషయంగా పరిస్థితులు అనుకూలించిన పక్షంలో అక్టోబర్‌లోనే జైలు నుంచి విడుదల అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment