సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్
రియాద్: సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ.. కఠిన చట్టాలు తెస్తూ దేశంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కాబోతున్నారు. తమ ఉమ్మడి శత్రువైన ఇరాన్ గురించి ఇరువురు దేశాధినేతలు ఈ భేటీలో చర్చిస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువరాజు సల్మాన్ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
పాలనలో విషయంలో ఇంచుమించు ఇటు సల్మాన్, అటు ట్రంప్ ఒకే రకం కావడం గమనార్హం. అమెరికాలో ట్రంప్ ఎలాగైతె కొత్త చట్టాలు తెచ్చారో సౌదీలో కూడా సల్మాన్ అలాంటి కఠిన చట్టాలే తెచ్చారు. అవినీతికి పాల్పడ్డారంటూ తన బంధుగణంలో 11మంది యువరాజులనూ, నలుగురు మంత్రులనూ బంధించారు. అంతేకాకుండా సౌదీలో నివసించే విదేశీయుల నుంచి నెలనెలా పన్ను వసూలు చేస్తున్నారు. తీవ్రవాదులకు సాయం చేస్తున్నారని ఖతర్‌తో ద్వైపాక్షిక సంబంధాలను తెంచుకున్నారు. యెమన్‌పై యుద్ధం ప్రకటించారు. సౌదీ దేశాభివృద్ధి కోసమే ఈ మేరకు కఠిన నిర్ణయాలు తీసుకుంటానని సల్మాన్ తెలిపారు. ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్న పలు ఆసక్తికరమైన విషయాలివి..
మహిళకి స్వేచ్ఛ ఇచ్చాం
ఒకప్పుడు సౌదీలో మహిళల పట్ల కఠిన చట్టాలు ఉండేవి. స్త్రీలు డ్రైవింగ్ చేయరాదు. ఆర్మీలో మహిళలకు అవకాశం లేదు. బయటకు వెళ్లాలంటే భయం. కానీ మా హయంలో మహిళలకి స్వేచ్ఛ ఇచ్చాం. ఆర్మీలో వారికి అవకాశం ఇచ్చాం. అన్నిరంగాల్లో మహిళలు రాణించేలా కృషి చేస్తున్నాం. ఉద్యోగం చేయాలంటే ఇకపై గార్డియన్ అనుమతి అవసరం లేకుండా చేశాం. మహిళా సాధికారతకు మేం కృషి చేస్తున్నాం.
సౌదీ అంటే ఇది కాదు
ఒకప్పుడు సౌదీవాసులు సాధారణ జీవితాన్ని గడిపేవారు. ఇరాన్‌లో ఇస్లాం విప్లవం, మక్కా మసీదును తీవ్రవాదులు బంధించడంతో దేశం నాశనం అయింది. 1979 కంటే ముందు దేశం చాలా బాగుండేది. స్త్రీలు డ్రైవింగ్ చేసేవారు. అన్ని దేశాల స్త్రీలలాగే సౌదీ మహిళలు కూడా అన్ని రంగాలలో పనిచేసేవారు. 1979 కంటే ముందు సౌదీ ఎలా ఉండేదో ఇంటర్నెట్‌లో చూడడండి. అప్పటి సాధారణ జనజీవితం ఎలా ఉండేదో తెలుస్తుంది.
ప్రక్షాళన చేయాల్సిందే
‘దేశంలో అవినీతి లేకుండా చేయడమే నా లక్ష్యం. తప్పు చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి. అది ఎవరైనా’ అంటూ 11మంది యువరాజులనూ, నలుగురు మంత్రులనూ బంధించడాన్ని సమర్థించుకున్నారు సల్మాన్. బంధించిన వారి నుంచి 100 బిలియన్ల డాలర్లను స్వాధీనం చేసుకున్నాం. డబ్బు వసూలు చేయడం మా లక్ష్యం కాదు. అవినీతిని నిర్మూలించాలనేదే మా కోరిక అని ఆయన అన్నారు.
నా ఆదాయంలో 51 శాతం ప్రజలకే ఇస్తా
ఒకవైపు సౌదీ ప్రభుత్వం ప్రజలు విలాసవంతమైన జీవితాన్ని గడుపరాదని, పొదుపు పాటించాలని ప్రబోధిస్తుండగా.. ఆ ప్రభుత్వాధినేతగా ఉన్న యువరాజు సల్మాన్ మాత్రం అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నివాసంగా పేరొందిన ఫ్రెంచ్ రాజభవనం ఒకటి ఆయన పేరిట ఉందని తాజాగా న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. దీనిపై సల్మాన్ స్పందిస్తూ నేనేమీ మహాత్మాగాంధీనో, నెల్సన్ మండేలానో కాదు. నేను ధనికుడిని. నాది విలాసవంతమైన జీవనశైలి. అయినా, ఆదాయంలో 51శాతం ప్రజలు, చారిటీలకు రాసిస్తానని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment