
తుళ్లూరులో తన వర్గం ముఖ్య నేతలతో, కార్యకర్తలతో సమావేశమైన శ్రావణ్‌కుమార్
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. టిక్కెట్లుదక్కని నేతలు భగ్గుమంటున్నారు. పార్టీ నాయకత్వం తమకు నమ్మకద్రోహం చేసిందంటూ నిప్పులు చెరుగుతున్నారు. తమ సత్తా చూపిస్తామని, టీడీపీ అభ్యర్థులను ఓడించి తీరుతామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. తమ అనుచరులతో కలిసి ఆందోళనకు దిగుతున్నారు. తమకు తీరని అన్యాయం జరిగిందని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు టీడీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. 126 మంది అభ్యర్థులతో సీఎం చంద్రబాబు తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు టిక్కెట్‌ను మంత్రి జవహర్‌కు మళ్లీ ఇస్తే ఓడిస్తామని ఆయన వ్యతిరేక వర్గం చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేసింది. దీంతో జవహర్‌ను కృష్ణా జిల్లా తిరువూరుకు పంపించారు. దీంతో అక్కడి ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జవహర్ శుక్రవారం తిరువూరులో స్వామిదాసు ఇంటికెళ్లారు. స్వామిదాసు వర్గీయులు జవహర్‌ను నిలదీసి నానా హంగామా చేశారు. ఇక్కడ ఎలా గెలుస్తావో చూస్తామంటూ శపథం చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి తనకు మళ్లీ సీటు ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఏడుసార్లు గెలిచిన తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
విజయనగరం సిట్టింగ్ ఎమ్మెల్యే గీత కూడా మళ్లీ తనకు అవకాశం ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు. అమలాపురం టిక్కెట్‌ను తనకు కాకుండా మరొకరికి ఎలా ఇస్తారని సిట్టింగ్ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ప్రశ్నించారు. టిక్కెట్ దక్కించుకున్న వ్యక్తిని ఓడిస్తామని ఆయన వర్గం చెబుతోంది. తనకు చింతలపూడి సీటు నిరాకరించడంపై మాజీ మంత్రి పీతల సుజాత ఆవేదన చెందుతున్నారు. దళిత మహిళను కావడం వల్లే తనను దెబ్బతీశారని వాపోతున్నారు. ఇదిలావుండగా చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ ముఖ్యమంత్రిని కలిసి తాను రాజంపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయలేనని, మళ్లీ చిత్తూరు ఎమ్మెల్యే సీటే ఇవ్వాలని కోరారు.
రాజధానిని గుప్పిట్లో పెట్టుకోవడానికి టీడీపీ పెద్దల కుట్ర
రాజధాని ప్రాంతంలోని తాడికొండ టిక్కెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు కాకుండా బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రికి ఇవ్వడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. శ్రావణ్‌కుమార్ మద్దతుదారులు శుక్రవారం సమావేశమై మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళన చేశారు. రాజధానిని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి టీడీపీ ముఖ్య నేతలు కుట్రలు పన్నుతున్నారని శ్రావణ్‌కుమార్ వర్గీయులు ఆరోపించారు. టీడీపీ అధిష్టానం తమ మనోభావాలను పట్టించుకోకుండా మరో అభ్యర్థిని తీసుకొచ్చి పోటీ చేయిస్తే టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఓట్లు వేస్తారనుకోవడం అవివేకమన్నారు. శ్రావణ్‌కుమార్‌కే టీడీపీ టిక్కెట్ ఇవ్వాలని, లేదంటే టీడీపీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తామని, తాడికొండలో టీడీపీని ఓడించి తీరుతామని హెచ్చరించారు. అధిష్టానం ఆదేశిస్తే తాడికొండ నుంచి పోటీ చేయడానికి సిద్ధమని శ్రావణ్‌కుమార్ ప్రకటించారు.
నూజివీడులో ముద్దరబోయినను ఓడిస్తాం..
కృష్ణా జిల్లా నూజివీడు టిక్కెట్‌ను ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు కేటాయించడంతో నియోజకవర్గంలోని ఓ ప్రధాన సామాజికవర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ సామాజిక వర్గానికి కాకుండా బీసీలకు టికెట్ ఇవ్వాలనుకుంటే బచ్చుల అర్జునుడికి ఇవ్వాలని కోరినప్పటికీ అధిష్టానం పట్టించుకోలేదని అంటున్నారు. ముద్దరబోయినను ఓడిస్తామని తేల్చిచెబుతున్నారు. నందిగామలో తంగిరాల సౌమ్యను అభ్యర్థిగా ప్రకటించటంపై అసమ్మతి వ్యక్తమవుతోంది. ఆమెకు వ్యతిరేకంగా పనిచేయాలని నియోజకవర్గ నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
తూర్పు కాపు వర్గానికే విజయనగరం టిక్కెట్ ఇవ్వాలి
విజయనగరంలో మీసాల గీతకు మద్దతుగా బీసీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. సిట్టింగ్‌గా ఉన్న గీతను కాదని, అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితికి టిక్కెట్ ఇవ్వడం సరికాదని అంటున్నారు. నియోజకవర్గంలో అధికంగా ఉన్న తూర్పుకాపు వర్గానికి చెందిన నేతకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మంగళగిరిలో లోకేశ్ అభ్యర్థిత్వంపై అసంతృప్తి
గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా నసీర్ అహ్మద్‌ను ప్రకటించడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్ ఆశించి భంగపడిన టీడీపీ సీనియర్ నేత షౌకత్ అలక బూనారు. దీంతో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా తూర్పు నియోజకవర్గానికి చెందిన మద్దాళి గిరిని ఖరారు చేయడంపై నియోజకవర్గ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వినుకొండ టిక్కెట్‌ను మళ్లీ జీవీ ఆంజనేయులుకే కేటాయించడంపై అసమ్మతివర్గ నాయకులు మండిపడుతున్నారు. ఇందుకు నిరసనగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కట్ట వలరాజు పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. తనపై అసమ్మతి వ్యక్తం చేసిన నాయకులను బుజ్జగించే పనిలో సత్తెనపల్లి అభ్యర్థి, స్పీకర్ కోడెల శివప్రసాదరావు పడ్డారు. మంగళగిరి అభ్యర్థిగా నారా లోకేశ్‌ను ప్రకటించడంతో నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి సెగ రాజుకుంది. పార్టీ నేతలతో లోకేశ్ నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల గైర్హాజరయ్యారు.
పార్టీ మారే యోచనలో బుట్టా రేణుక
కర్నూలు జిల్లా ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. ఆలూరు టీడీపీ టిక్కెట్‌ను కోట్ల సుజాతమ్మకు కేటాయించడాన్ని ఇప్పటిదాకా ఇన్‌చార్జిగా వ్యహరించిన వీరభద్రగౌడ్, వైకుంఠం మల్లికార్జున, మసాల పద్మజ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌పై కర్నూలు ఎంపీగా గెలుపొందిన బుట్టా రేణుకకు ఆ సీటు ఇవ్వకుండా ఆదోని అసెంబ్లీ టిక్కెట్ కేటాయిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, చివరకు ఆ టిక్కెట్‌ను మీనాక్షి నాయుడికి కేటాయించారు. దాంతో బుట్టా రేణుక శుక్రవారం తను అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ మారాలని ఆమె యోచిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment