
సాక్షి, పనాజీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాటలు తనను అమితంగా ఆకర్షించాయని, అందుకే తాను పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్నానని గోవా కాంగ్రెస్ చీఫ్‌గా పనిచేసిన శాంతారాం నాయక్ అన్నారు. యువ నాయకత్వానికి పార్టీ సీనియర్లే మార్గం వేయాలని, వారికి రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీలో యువనాయకత్వాన్ని నింపాలని చెప్పిన రాహుల్ మాటలతో తాను మనస్ఫూర్తిగా ఏకీభవిస్తున్నానని చెప్పారు. అందుకే తన స్థానంలో యువ నాయకత్వానికి అవకాశం ఇచ్చేందుకు తాను పార్టీ చీఫ్ బాధ్యత నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ పార్టీలో సీనియర్లు తప్పుకొని యువకులకు అవకాశం ఇవ్వాలని చెప్పారు.
దాంతో గోవా కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న 71ఏళ్ల శాంతారాం నాయక్ తన బాధ్యతలకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ తన రాజీనామా లేఖను ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్‌గాంధీకి పంపించానని, అలాగే, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి మరో లేఖను పంపించినట్లు చెప్పారు. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని రాజ్‌బబ్బార్, గుజరాత్‌లోని భరత్‌సింహ సోలంకీ కూడా పార్టీ చీఫ్ బాధ్యతలకు రాజీనామా చేసి ఆ లేఖలు పంపించారని, అందుకు తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. రాహుల్ ఇచ్చిన పిలుపుమేరకు సీనియర్లు సానుకూలంగా స్పందిస్తూ సహకరిస్తున్నారని, ఇది చాలా మంచి పరిణామం అని ఆయన తెలిపారు.
'రాహుల్ మాటలు నన్ను ఎంతో ఆకర్షించాయి. ఆ క్షణంలోనే రాజీనామా చేద్దామనుకున్నాను. అయితే, ఒక విశిష్టకార్యక్రమం జరుగుతున్న సమయంలో రాజీనామా చేయడం సబబు కాదని ఆగాను. అయితే, నా స్థానంలో ఎవరు వస్తారనే విషయం మాత్రం నేను చెప్పను. ఎందుకంటే అది పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. అయితే, కనీసం పదేళ్లపాటు పార్టీకోసం పనిచేసిన యువకుడిని పెడితే బాగుంటుందని మాత్రమే నా ఉద్దేశం. రాష్ట్ర పార్టీ సారథిగా వచ్చే వారికి పార్టీపై ప్రేమ, అంకితభావం ఉండాలి. రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకున్న నేపధ్యంలో యువతి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు' అని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment